Ys Jagan : జగన్ వెనకంజ వేస్తుంది అందుకేనట.. లీడర్లకు క్లారిటీ ఇచ్చారుగా

వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన వాయిదాలు పడటానికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతుంది.

Update: 2026-01-21 09:02 GMT

వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన వాయిదాలు పడటానికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతుంది. నిజానికి గత ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు చేయాలని భావించారు. 2025 జనవరి సంక్రాంతి తర్వాతనే తాను జిల్లాల పర్యటన చేస్తానని చెప్పారు. కానీ 2026 జనవరి వచ్చి సంక్రాంతి వెళ్లిపోయాని ఇంత వరకూ జగన్ జిల్లాల పర్యటనపై క్లారిటీ రాలేదు. జగన్ ముందుగా అనుకున్నది 2027 నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. 2029 ఎన్నికలకు పార్టీని విజయ పథంలో నడిపేందుకు 2027లో పాదయాత్ర మొదలు పెట్టి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. అంతకు ముందుగానే జిల్లాల పర్యటన 2025లోనే చేయాలనుకున్నారు.

పాదయాత్రకు ముందు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ బయటకు రావడానికి భయపడింది. అలాగే అనేక మంది నేతలు కూడా యాక్టివ్ గా లేరు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నా, తన పాదయాత్ర విజయవంతం కావాలన్నా ముందుగా జిల్లాల పర్యటనలు చేసి క్యాడర్ లోనూ, లీడర్లలోనూ జోష్ పెంచాలన్నది జగన్ ఆలోచన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కొక్కరు నెలల తరబడి జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుంది. దీంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలను కూడా తెలుసుకునే వీలు జిల్లాల పర్యటనలో కలుగుతుందని అనుకున్నారు.
బూత్ లెవెల్ కమిటీలను...
కానీ గత ఎన్నికల సందర్భంగా అనేక మంది నేతలను నియోజకవర్గాలను మార్చారు. ఇప్పటి వరకూ కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు జరగలేదు. కొన్నింటిలో ఇన్ ఛార్జులను మార్చినప్పటికీ కొత్త ఇన్ ఛార్జులను నియమించడం లేదు. మరొకవైపు పార్టీ బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇంకా పార్టీ నేతలు పూర్తి చేయలేదు. అవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే జిల్లాల పర్యటన చేస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిన్న ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలోనూ జగన్ జిల్లాల పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముందు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, తర్వాత జిల్లాల పర్యటన చేపడతానని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ జిల్లాల పర్యటన ప్రస్తుతానికి ఆగినట్లేనని పార్టీ నేతలు అంటున్నారు.









Tags:    

Similar News