Ys Jagan : జగన్ అర్ధమవుతుందా? కోటరీ మధ్య నుంచి బయటకు రారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదమూడు నెలలు కావస్తుంది. ఈ పదమూడు నెలల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారంటే ఏమీ లేదనే చెప్పాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదమూడు నెలలు కావస్తుంది. ఈ పదమూడు నెలల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారంటే ఏమీ లేదనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలు, హామీలు అమలు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తం చేయడం మినహా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? అంటే శూన్యమే అని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి నెలలో రెండు సార్లు రావడం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కావడం మినహా మరే రకమైన కార్యక్రమాలను చేపట్టలేదు. ఇక రైతుల సమస్యలపై జిల్లాలకు వెళ్లి వారి బాగోగులను తెలుసుకోవడం, అక్రమ కేసుల్లో ఇరుక్కున్న పార్టీ నేతలను పరామర్శించడం వంటి వాటితో సరిపెట్టేశారు.
తొలినాళ్లలోనే హడావిడి...
ఇక ఓటమిచెందిన తొలి నాళ్లలో ముఖ్య కార్యకర్తలతో జగన్ ముఖాముఖి అని హడావిడి చేసినా ఒకటి రెండు జిల్లాలతోనే సరిపెట్టేశారు. అందులోనూ స్థానికసంస్థల ప్రతినిధులు అధికార పార్టీకి వెళ్లకుండా ఉండేందుకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు పెట్టి పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు ఊరికే కూర్చోలేదు. జిల్లాలను పర్యటించారు.నేరుగా జిల్లాలకే వెళ్లిన చంద్రబాబు నేతలు,కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పడు ఓటమి భవిష్యత్ విజయానికి నాంది అని చెప్పి క్యాడర్ లో ధైర్యం నింపడంలో నాడు చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారు.
అధికారంలో లేనప్పుడూ...
కానీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎలా ఉన్నారో.. కోల్పోయినప్పుడు కూడా అదే స్థాయిలో తాడేపల్లి పార్టీ కార్యాలయాన్ని వీడటం లేదు. పాదయాత్ర చేస్తారనని అంటున్నాఅందుకు చాలా సమయం ఉంది. కానీ అంతకంటే ముందుగా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలి. జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు,నేతలను పిలిచి మాట్లాడాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను వారి నుంచి తెలుసుకోవాలి. ఓపిగ్గా వినాలి. మరొకసారి అధికారంలోకి వస్తే అలాంటి తప్పులు దొర్లవన్నహామీ వారికి అక్కడే ఇవ్వగలిగాలి. అంతేకాని అధికారంలో ఉన్నప్పటి లాగానే కోటరీ మధ్య చిక్కుకుంటే పరిస్థితుల్లో మార్పు రాదన్న విషయం జగన్ గుర్తించాలన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి నేను ఉన్నాను.. నేను విన్నానంటూ జనం మధ్య నాడు వెళ్లినట్లే ఇప్పడు క్యాడర్ మధ్యకు వైసీపీ చీఫ్ వెళ్లాల్సి ఉంది.