కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. హై అలర్ట్ గా ఉండాలని సీఎం ఆదేశం

నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Update: 2022-05-11 09:42 GMT

అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన 'అసని' తుఫాను ఊహించని రీతిలో తన దిశను మార్చుకుంటోంది. నిన్నటి నుంచి ఐదుసార్లు దిశను మార్చుకున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తొలుత విశాఖకు, తర్వాత కాకినాడ, నిన్న మధ్యాహ్నం మచిలీపట్నం, సాయంత్రానికి బాపట్ల-చీరాల.. ఇప్పుడు నరసాపురం వైపు అసని దిశ మార్చుకుంది. వాయవ్య దిశగా పయనించి.. పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందనుకున్న అసని.. ఇప్పుడు ఆగ్నేయంగా కదులుతూ.. నరసాపురానికి 30, మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం అసని తుఫాను 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు పేర్కొంది. సాయంత్రానికి నర్సాపురం తీరాన్ని తాకితే.. తిరిగి యానాం వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలిపింది. రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా బలహీనపడుతుందని, పూర్తిగా బలహీనపడేంతవరకూ తీరంవెంబడే పయనిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐఎండీ కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా.
ఏపీకి అసని తుఫాను ముప్పు ఉందని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో.. సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సహాయక చర్యలపై అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు.. ముఖ్యంగా తీరప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమయంలోనైనా సహాయకచర్యలు చేపట్టేందుకు సమాయత్తమవ్వాలని ఆదేశించారు. తుఫాను బలహీనపడుతుందని నిర్లక్ష్యం తగదన్న జగన్.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ క‌ల‌గ‌కుండా చూడాల‌న్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.





Tags:    

Similar News