USha Chilukuri : ఉషా.. రావమ్మా.. మా ఊరికి
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య ఉషా చిలుకూరి సొంతూరు ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య ఉషా చిలుకూరి సొంతూరు ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వచ్చి పోవమ్మా అంటూ పిలుస్తున్నారు. ఉషా చిలుకూరి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు. అయితే ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఆమె చిన్ననాడే అమెరికాకు వెళ్లిపోయారు. ఉషాకు చిన్న నాటి బాల్యం అంతా అమెరికాలోనే గుర్తుంది. అయితే ఆమె తల్లిదండ్రులది మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కావడంతో ఆమెకు సొంతూరిపై ప్రేమ సహజంగా ఉంటుంది.
ప్రేమ వివాహం...
ఉషా చిలుకూరి కళాశాల విద్యను అభ్యసించే రోజుల్లో జేడీ వాన్స్ ప్రేమలో పడిపోయారు. అంతే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది వివాహానికి దారి తీసింది. ఇద్దరి పెళ్లికి రెండు కుటుంబాలకు చెందిన వారు అంగీకరించడంతో అమెరికాలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడే ఆయన విజయం తథ్యమని తేలిపోయింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా మారారు.
సొంతూరికి రావాలంటూ...
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత తొలిసారి జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో కలసి తొలి సారి భారత్ కు చేరుకున్నారు. భారత్ లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు పలు చోట్ల వారు పర్యటించనున్నారు. అయితే ఉషా చిలుకూరి ఒకసారి సొంతూరు అయిన వడ్లూరుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడకు వచ్చి పాత జ్ఞాపకాలను నెమరేసుకోవచ్చని తెలిపారు. వారి తల్లి దండ్రులతో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరరు వేసుకుంటున్నారు. ఉషా తమ ఊరికి వస్తే సన్మానాలు చేస్తామని అంటున్నారు. ఒక్కసారి వచ్చిపోమ్మా.. అని స్థానికులు అంటున్నారు.