Rain Alert : మరో ద్రోణి... మూడు రోజులు వానలు తప్పవట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. అలాగే కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్లు, విద్యుత్తు స్థంభాల కింద నిల్చోకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.
మోస్తరు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఇక కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పన్నెండు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.