Rani Alert : ఈరోజు భారీ వానలు పడే ప్రాంతాలివే.. అటు వెళ్లే వారికి అలెర్ట్
మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో్ భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది
మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో్ భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్నదక్షిణ తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఈ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాయసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఏపీలో ఈ ప్రాంతంలో...
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది. దక్షిణ కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడతాయని చెప్పిన వాతావరణ శాఖ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణలోనూ నాలుగు రోజులు...
తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల్, వనపర్లి, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తలు పాటించాలని, చెట్ల కింద, విద్యుత్తు స్థంభాల కింద నిలబడరాదని అధికారులు కోరారు.