Andhra Pradesh : తొలి సంతకానికి నేడు నోటిఫికేషన్.. మెగా డీఎస్సీ ప్రకటన నేడే
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ ఈరోజు నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి నేడు విడుదల చేసే నోటిఫికేషన్ తో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు రానున్నాయి.
అధికారంలోకి రాగానే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే పెట్టారు. అయితే టెట్ పరీక్ష ను నిర్వహించాల్సి రావడంతో పాటు మరి కొన్నికారణాల వల్ల ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు సంబంధించిన హామీని నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారు. అనుకున్నట్లుగానే ఈరోజు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సమయం నుంచి విద్యాశాఖ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంటాయి.
జూన్ లో పరీక్షలు...
ఉపాధ్యాయ పోస్టుల వివరాలతో పాటు పరీక్ష షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచనున్నారు. మొత్తం మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు భర్తీ కానుండటంతో టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారంతా ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇచ్చారు. జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలలతో పాటుగా రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రాధమిక కీ విడుదల చేయనున్నారు.