Free Bus for Women : ఏపీలో ఉచిత బస్సు టైర్ పంక్చర్ అయినట్లేనా? మంత్రి ప్రకటన అలాగే ఉందిగా
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో మహిళలు ఎక్కడికైనా తాము రయ్ రయ్ మంటూ ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చని భావించారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లాల్సి ఉన్నా, బంధువుల ఇళ్లకు, పెళ్లిళ్లకు, పబ్బాలకు ఇక ఆర్టీసీ బస్సుల్లో వెళ్ల వచ్చని కలలు కన్నారు. కానీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి చేసిన ప్రకటన ఉసూరు మనిపిపస్తుంది. ఉచిత బస్సు పథకాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనసభలో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీలులేదు.
రాష్ట్రం మొత్తం కాదు...
కేవలం జిల్లాలకు మాత్రమే ఉచితం పరిమితమవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి నివేదికను కూడా సమర్పించింది. మరోవైపు రవాణా శాఖ అధికారులు కూడా పథకం అమలులో ఉన్న కష్టనష్టాలను కూలంకషంగా వివరించారు. కర్ణాటక, తమిళనాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలవుతుంది. దీనివల్ల ఆర్టీసీపై భరించలేని భారం పడుతుంది. కర్ణాటక లో అయితే ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన దీంతో ఈ పథకం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో మార్పులు చేయడానికి నిర్ణయించినట్లు స్పష్టంగా కనపడుతుంది. జిల్లాల వరకే అయితే చాలా వరకూ భారం తగ్గుతుందని అధికారులు కూడా అభిప్రాయపడ్డారు. కర్ణాటక, తెలంగాణలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలవుతుంది. రాష్ట్ర సరిహద్దుల వరకూ ఉచితంగా మహిళలు ప్రయాణంచే వీలుంది.
జిల్లా దాటితే...
దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదనపు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేయగలిగితే బస్సుల సంఖ్యతో పాటు సిబ్బంది నియామకాలు కూడా తగ్గించే అవకాశముంటుదని తాజాగా గణాంకాలు ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెచ్చినట్లు కనిపిస్తుంది. ఒక జిల్లాలో ఉండే వారు ఆ జిల్లా వరకూ మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంతే తప్పించి తాము నివాసం ఉంటున్న జిల్లాల నుంచి వేరే జిల్లాలకు వెళ్లాలంటే మాత్రం ఛార్జీలు చెల్లించాల్సిందే. జిల్లాల్లోనూ కొన్ని బస్సులకు మాత్రమే ఉచితాన్ని అమలు చేయబోతున్నారు.