Free Bus For Women : మహిళల ఉచిత ప్రయాణంపై లేటెస్ట్ అప్ డేట్
ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తుంది. ఉచితంగా మహిళల బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని నామకరణం చేశారు
ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తుంది. ఉచితంగా మహిళల బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని నామకరణం చేశారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులు విధివిధానాలను రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం చేసే మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్ ను అందచేస్తారు. దీనివల్ల ఆ మహిళ ఉచిత ప్రయాణం ద్వారా ఎంత లబ్దిపొందిందన్నది తెలియనుంది. అప్పుడు ప్రభుత్వం అమలు చేసే పథకం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
జీరో ఫేర్ టికెట్ పై...
ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టికెట్ పై స్రీశక్తి అని ముద్రించనున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రస్తుతం కండక్టర్ల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. మహిళలు బస్సులోకి ఎక్కినప్పుడు వారి పట్ల గౌరవంగా వ్యవహరిచండంతో పాటు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం వంటి వాటిపై కండక్టర్లకు శిక్షణ కొనసాగుతుంది. మర్యాదపూర్వకంగా ఆహ్వానించడంతో పాటు గొడవలు జరగకుండా చూడటం వంటి వాటిపై కండక్టర్లకు శిక్షణ అందిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాల వరకే ఉచిత ప్రయాణం అందివ్వనున్నారా? లేక రాష్ట్రం మొత్తం మీద ఉచితంగా ప్రయాణించేలా ఇతర రాష్ట్రాల తరహాలో అమలు పర్చనున్నారా? అన్నది త్వరలోనే తేలనుంది.
కేబినెట్ లో చర్చించి...
దీనిపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తసీుకునే అవకాశముంది. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వర్తింప చేయడం ద్వారా ఆర్థిక భారం పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారా? లేదా? అన్నది కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విధివిధానాలను రూపొందించిన అధికారులు ఆగస్టు 4వ తేదీన జరిగే కేబినెట్ సమావేశం ముందు ఉంచనునట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం అధికారికంగా గైడ్ లైన్స్ ను విడుదల చేయనున్నారు. అప్పటివరకూ ఉమ్మడి జిల్లాల వరకు మాత్రం ఉచిత జర్నీకి అనుమతిస్తారన్న ప్రచారమయితే అధికార వర్గాల నుంచి వినిపిస్తుంది.