బెజవాడ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు పనులు ఇక వేగంగా?
బెజవాడ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరే అవకాశం కనిపిస్తుంది.
బెజవాడ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరే అవకాశం కనిపిస్తుంది. విజయవాడలో మెట్రో పనులకు అడుగు పడింది.గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకూ ఒక కారిడార్, పెనమలూరు నుంచి బస్టాండ్ వరకూ మరో కారిడార్ ను తొలి దశలో నిర్మించాలని నిర్ణయించింది. తొలి విడతలో రెండు కారిడార్లుగా మెట్రో రైలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. అయితే ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రెండు కారిడార్ల ఏర్పాటుకు మొత్తం తొంభయి ఒక్క ఎకరాలు అవసరమని విజయవాడ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది.
తొలి దశలో రెండు కారిడార్లు...
విజయవాడలోని పీఎన్‌బీఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు కలిసేలా తొలిదశ నిర్మాణం చేయనున్నారు.తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లుగా నిర్ణయించారు. రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లుగా ఉంది. ఈ రెండు కారిడార్లు పూర్తయితే విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చాలా వరకూ తీరనున్నాయి. విజయవాడలో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య నగరవాసులను పట్టిపీడిస్తుంది. గంటల కొద్ది వాహనాలు రోడ్లు మీదనే నిలిచిపోతున్నాయి. రోడ్డు మార్గం మాత్రమే ఉండటంతో బెజవాడ నగరం నుంచి అడుగు బయటపెట్టాలంటే గగనమై పోయింది. ఈ దశలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
మొత్తం నాలుగు కారిడార్లు...
విజయవాడ వాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించేందుకు మొత్తం నాలుగు కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే తొలిదశలో రెండు కారిడార్ల నిర్మాణానికే భూసేకరణ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్‌ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి, అక్కడి నుంచి గన్నవరం వెళ్తుంది. రెండో కారిడార్ బస్టాండ్ నుంచి ప్రారంభమై బందరు రోడ్డు మీదుగా బెంజిసర్కిల్,ఆటోనగర్, కానూరు,పోరంకి మీదుగా పెనమలూరు వరకు వెళ్తుంది.ఈ క్రమంలో పీఎన్‌బీఎస్,బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం,ఇందిరాగాంధీ స్టేడియం,బెంజి సర్కిల్, ఆటోనగర్,అశోకనగర్, కృష్ణానగర్,కానూరు సెంటర్ తాడిగడప,పోరంకి మీదుగా పెనమలూరుకు చేరుకుంటుంది. ఈప్రాంతంలో భూసేకరణకు అధికారులకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. భూసేకరణ పూర్తయితే ఇక పనులను వేగంగా పూర్తిచేయాలని విజయవాడ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు.