గొట్టిపాటి విజయ రహస్యమేంటి? ఎవరికైనా తెలుసా? అయితే తెలుసుకోండి
ప్రకాశం జిల్లాలోని అద్దంకి శాసనసభ నియోజకవర్గం గొట్టిపాటి రవికుమార్ గ్రిప్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు
ప్రకాశం జిల్లాలోని అద్దంకి శాసనసభ నియోజకవర్గం గొట్టిపాటి రవికుమార్ గ్రిప్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కరణం కుటుంబాన్నినియోజకవర్గానికి దూరంచేసిన నేతగా గొట్టిపాటి రవికుమార్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ ను ఓడించాలని ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. పార్టీలతో సంబంధం లేకుండా వరస గెలుపులతో గొట్టిపాటి అద్దంకి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆయన గెలుపు సీక్రెట్ ఏంటి? సాధారణంగా ఒకసారి గెలిస్తేనే అసంతృప్తి ప్రజల్లో ఉంటుంది. కానీ నాలుగు సార్లు వరసగా గెలవడం మాటలు కాదు.
పార్టీలు మారినా...హిస్టరీ క్రియేట్ చేస్తూ...
2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కరణం బలరామ్ ను ఓడించారు. 2014లోవైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ తన సమీప ప్రత్యర్థి కరణం వెంకటేశ్ పై గెలిచారు. ఇలా రెండు సార్లు కరణం కుటుంబాన్ని ఢీకొట్టారు. విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూటమి హవా కొనసాగినా అద్దంకి నుంచి గెలిచారు. తర్వాత ఆయన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి తన సమీప వైసీపీ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్యను చిత్తుగా ఓడించగలిగారు. నాడు టీడీపీకి 23 స్థానాలు మాత్రమే వస్తే అందులో అద్దంకి ఒకటి. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ తన సమీప వైసీపీ ప్రత్యర్థి పాణ్యం చిన హనిమిరెడ్డిపై విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.
అసలు కిటుకు అదే...
ఇంతకీ గొట్టిపాటి రవికుమార్ విజయ రహస్యమేంటన్నది ఎవరికీ అర్థం కానీ విషయం. హేమాహేమీలే ఒక ఎన్నికల్లో గెలిచి తర్వాత ఎన్నికల్లో ఓడిపోతున్న తరుణంలో గొట్టిపాటి నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడం మాత్రం రాజకీయనేతలకు ఒక పొలిటికల్ సిలబస్ అని చెప్పాలి. ప్రధానంగా గొట్టిపాటి రవికుమార్ ప్రజల్లో కలసి పోతారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారికి కష్టమొస్తే ప్రభుత్వం పరంగా కాకపోతే తాను స్వయంగా ఆదుకుంటారు. నిత్యం జనంలో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించేంత వరకూ నిద్రపోరు. నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తీర్చిదిద్దుతూ అందరి ఆదరాభిమానాలను పొందుతున్న గొట్టిపాటిని ఓడించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ప్రత్యర్థులు పై చేయి సాధించలేకపోయారు.
మళ్లీ కరణం వచ్చినా...
అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ ను ఓడించడానికి నాడు టీడీపీ, నేడు వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. అయినా ఆ ప్రయోగాలేమీ ఫలించలేదు. కరణం కుటుంబాన్ని తిరిగి వైసీపీ అద్దంకి నియోజకవర్గానికి తీసుకు వచ్చింది. కరణం వెంకటేశ్ ను వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించింది. అయితే గొట్టిపాటి గ్రాఫ్ ముందు కరణం వెంకటేశ్ నిలబడతారా? లేదా? అన్నది భవిష్యత్ లో తేలనుంది. కానీ ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ కు మాత్రం ఎదురు లేకుండా అద్దంకి నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చుకున్నారు. 2029 ఎన్నికల్లోనూ ఐదోసారి గెలిచేందుకు అవసరమైన ప్రయత్నాలను ప్రతి రోజూ ఆయన ప్లాన్ చేసుకుంటూనే ఉంటారంటున్నారు. మరి గొట్టిపాటిని ఓడించేదెవరు? అన్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో మాత్రం హాట్ హాట్ గా చర్చ జరుగుతూనే ఉంది.