Yanamala : యనమలకు పట్టు చిక్కినట్లే చిక్కి తప్పుతున్నట్లుందిగా?

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తుని నియోజకవర్గంలో పట్టు చిక్కడం లేదు

Update: 2025-02-18 07:17 GMT

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తుని నియోజకవర్గంలో పట్టు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. తిరుపతి కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్, పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. కానీ తుని విషయానికి వచ్చేసరికి రామకృష్ణుడు ఎత్తులు పారడం లేదు. సుదీర్ఘకాలం తునిని టీడీపీ గెలుచుకుందనుకున్నా ఆనందం, తన కుమార్తె తుని ఎమ్మెల్యే అయిందన్న సంతోషం కన్నా ఈ వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోలేకపోతున్నాననే బాధ యనమలలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఈరోజు కూడా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

నాలుగో సారి కూడా...
సమయం మించిపోవడంతో నాలుగోసారి కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం నుంచి తునిలో హైడ్రామా నడిచింది. టీడీపీకి చెందిన కౌన్సిలర్లు అందరూ కౌన్సిల్ హాలుకు చేరుకున్నా వైసీపీ కౌన్సిలర్లు మాత్రం హాజరు కాలేదు. వైసీపీ కౌన్సిలర్లందరూ... మాజీ మంత్రి దాడి శెట్టి రాజా తన పార్టీకి చెందిన కౌన్సిలర్లతో ఉన్నారు. ఆయన నుంచి బయటకు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఇప్పటి వరకూ మూడుసార్లు వాయిదా పడటంతో నాలుగో సారి అయినా వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని భావించారు. కానీ నేడు కూడా వాయిదా పడటంతో తిరిగి ఈ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది.
పట్టుపెంచుకుని సత్తా చాటాలనుకున్నా...
తునిలో పట్టు పెంచుకుని పార్టీలో తన సత్తా చాటుదామనుకుంటున్న యనమల రామకృష్ణుడికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చుక్కలు చూపిస్తున్నారు. తన వర్గంలో ఉన్న కౌన్సిలర్లు ఎటూ వెళ్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కోడిపిల్లలకు తల్లి కాపలా కాచుకుంటున్నట్లు కాపాడుకుంటున్నారు. దీంతో యనమలకు తుని మున్సిపాలిటీలో ఊపిరి సలపడం లేదు. అప్పటికీ పది మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి వెళ్లిపోయారు. అయితే మిగిలిన వారు వెళ్లకుండా తన పట్టును కాపాడుకుంటున్నారు. దీంతో అధికారాన్ని ఉపయోగించుకుని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా ఫలవంతం కావడం లేదు. తుని మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకున్న తర్వాత పార్టీ హైకమాండ్ తన వైపు చూస్తుందని యనమల రామకృష్ణుడు భావించారు.
గ్యాప్ పెరగడంతో...
ఇప్పటికే యనమల రామకృష్ణుడుకు పార్టీ అధినాయకత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. యనమల కుటుంబంలో అనేక మందికి టిక్కెట్లు ఇచ్చినప్పటికీ తనకు ఇంకా మంత్రి పదవి కావాలని పట్టుబట్టడం ఏంటన్నది పార్టీ అధినాయతక్వం ప్రశ్నిస్తున్నది. అదే సమయంలో తాను సీనియర్ గా పార్టీకి ఎంతో సేవలు చేశానని, కష్ట సమయంలో వెన్నుదన్నుగా ఉన్నానని, అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమేంటన్నది యనమల రామకృష్ణుడి సూటి ప్రశ్న గా ఉంది. యనమల బీసీలకు అనుకూలంగా, కాకినాడ పోర్టుపై చేసిన కామెంట్స్ కూడా అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయనను దూరం పెట్టినట్లే కనిపిస్తుంది. పొలిట్ బ్యూరో లో కూడా కొత్త వారికి అవకాశం అంటే యువతరానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే యనమల రామకృష్ణుడు తుని మున్సిపాలిటీపై జెండా ఎగురేసి కాలరు పైకెగరేద్దామనుకున్నారు. కానీ అది వీలు కావడం లేదు.


Tags:    

Similar News