ఇంజినీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 40మందికి అస్వస్థత !

గురువారం రాత్రి కళాశాల హాస్టల్ లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత పలువురు విద్యార్థులు

Update: 2022-01-07 08:18 GMT

కర్నూల్ లోని రవీంద్ర, పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫుడ్ పాయిజన్ అయి.. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కానీ.. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యాలు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి కళాశాల హాస్టల్ లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యార్థులు హాస్టల్ వార్డెన్ల దృష్టికి తీసుకెళ్లగా.. వార్డెన్లు కళాశాల యాజమాన్యానికి విషయం చెప్పారు.

దాంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. ముగ్గురు వైద్యులను రహస్యంగా హాస్టల్ కు పిలిపించి, అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యం అందించినట్లు సమాచారం. రెండు కళాశాలల్లో మొత్తం 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా.. 15మంది విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా, మరో ఐదుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్లో తిన్న తిండి ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని స్థానికంగా ప్రచారం జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ పై కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.


Tags:    

Similar News