Andhra Pradesh : జగన్ కు ఇక రానున్నది మంచికాలమేనా? అదే ధైర్యమా?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీలో మరింత జోష్ పెరిగే అవకాశలుంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీలో మరింత జోష్ పెరిగే అవకాశలుంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ పార్టీ బలోపేతం అయ్యేందుకు ఛాన్స్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే కాకుండా రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో క్యాడర్ తో పాటు లీడర్లు కూడా నీరసంగా కనిపిస్తున్నారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులకు భయపడి కొందరు వెనక్కు రావడం లేదు.
పదిహేను నెలలు గడుస్తున్నా...
సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు పదిహేను నెలలు కావస్తుంది. ఇప్పటికే వైసీపీ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కువ మంది నేతలు బయటకు రావడం లేదు. కేవలం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే అలా కనిపించి తిరిగి వెళ్లిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా ఐదేళ్లలో దాదాపు యాభై మంది వరకూ మంత్రులున్నారు. ఇందులో పది మంది కూడా యాక్టివ్ గా లేరు. మంత్రి పదవి అనుభవించిన వారే పార్టీకి, రాజకీయాలకు, క్యాడర్ కు దూరంగా ఉంటున్నారు. ఆ పది మాత్రం అక్కడక్కడ నోరు విప్పుతున్నారు. వీధుల్లోకి వస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు చక్కని అవకాశం లభించినట్లయింది.
మొహం చాటేసిన నేతలు కూడా...
వచ్చే ఏడాది జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని కూడా తాజాగా షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైసీపీ మళ్లీ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పటి వరకూ మొహంచాటేసిన నేతలు కూడా గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, కార్పొరేషన్ లలోనూ తమ వారిని గెలిపించుకునేందుకు నాయకులు తప్పనిసరిగా ముందుకు రావాల్సి ఉంటుంది. పై స్థాయి నాయకత్వం నుంచి కింది స్థాయి నాయకత్వం వరకూ ఈ ఎన్నికలతో బలపడే అవకాశముంటుంది.
మరో మూడేళ్లు మాత్రమే...
మరో మూడేళ్లు మాత్రమే సాధారణ ఎన్నికలు ఉండటంతో ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలు, వైసీపీల మధ్య హోరాహోరీ సాగుతుందన్నవిశ్లేషణలు వెలువడుతున్నాయి. జగన్ కు నిజంగా కొత్త ఏడాది తీపికబురేనని ఒకరకంగాచెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలయినా క్యాడర్ నుంచి లీడర్ వరకూ పార్టీ కోసం ఇక పనిచేయడానికి సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మరో మూడు నెలల పాటు జగన్ ఇలా బెంగళూరు టు తాడేపల్లి తిరుగుతుంటారని, తర్వాత ఇకజనంలోకి కూడా వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో 2026 ఏడాది ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.