Vidadala Rajini : విడదల అరెస్ట్ కు అంతా సిద్ధమయిందా? రజనీ చుట్టూ బిగసుకుంటున్న ఉచ్చు

మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత రజనిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది

Update: 2025-04-24 07:02 GMT

మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో తర్వాత అరెస్ట్ అయ్యేది విడదల రజనీ అంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషన్ నిర్వాహకులను బెదిరించి 2. 20 కోట్ల రూపాయలను వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీమంత్రి విడుదల రజనితోపాటు ఆమె మరిది గోపిపైనా కేసు నమోదైంది. వీరికి సహకరించిన ఐసీఎస్ అధికారి జాషూవా సహా మాజీ మంత్రి రజని పీఏ రామకృష్ణపైనా ఏసీబీ కేసు నమోదు చేసింది.

ముందస్తు బెయిల్ కోసం...
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీమంత్రి రజనీతోపాటు ఆమె మరిది గోపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ హైకోర్టులో విచారణ దశలో ఉండగానే ఏసీబీ అధికారులు గోపిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ విజిలెన్స్ అధికారి జాషువా సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సైతం విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న విడదల రజనీ విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే గోపీని విచారించిన తర్వాత విడదల రజనీని అదుపులోకి తీసుకుంటారా? లేక ఈరోజు అరెస్ట్ చేసి ఇద్దరినీ వేర్వేరుగా ముడుపుల వ్యవహారంలో విచారిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
విదేశాల్లో వ్యాపారం చేసి...
విడదల రజని కుటుంబం విదేశాల్లో వ్యాపారాలు చేసి బాగానే సంపాదించారు.తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు ఉండటంతో టీడీపీలో సీటు దక్కదని తేలిపోయి వైసీపీలోకి జంప్ చేశారు. టీడీపీ ఉన్నసమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలుచేసినా ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. వైసీపీలో్ చేరినవెంటనే చిలకలూరిపేట అసెంబ్లీ టిక్కెట్ ను 2019 లో సాధించి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. దీతోనే విడదల అదృష్టం ఆగలేదు. మంత్రి వర్గ విస్తరణలో విడదల రజనీకి ఏకంగా మంత్రిపదవి లభించింది.ముఖ్యమైన వైద్య శాఖను విడదల రజనికి జగన్ కేటాయించారు. కానీ అనేక ఆరోపణలు రావంతో 2024 ఎన్నికల్లో మాత్రం విడదల రజనికి వైసీపీలో చిలకలూరిపేట టిక్కెట్ దక్కలేదు. ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పార్టీ అధినాయకత్వం షిఫ్ట్ చేసింది.
వరస గా అరెస్ట్ అవుతుండటంతో...
వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో పాటు విడదల రజనీకూడా ఓటమి పాలయ్యారు. చిలకలూరి పేటను వదిలి వచ్చేందుకు ఇష్టం లేకపోయినా జగన్ మాటను కాదనలేక, మరొకసారి అధికారంలోకి వస్తామని భావించి ఆమె వైసీపీనుంచి పోటీచేశారు. కానీ క్రషర్ యజమానిని బెదిరించారి రెండు కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా గోపీని అరెస్ట్ చేయడంతో విడదల రజనీని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశముందని సమాచారం. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న సమయంలోనే అదుపులోకి తీసుకుని దీనిపై విచారించేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీలో వరసగా నేతలతో పాటు మాజీ అధికారులు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో విడదల అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది.


Tags:    

Similar News