Andhra Pradesh : గిరిజనుల కష్టాలు తీరేదెన్నడు...? డోలీ మోత తప్పేదెన్నడు?

ఆంధ్రప్రదేశ్ లో పాలకులు మారినా గిరిజనుల తలరాతలు మారడం లేదు. డోలీ కష్టాలు తప్పడం లేదు.

Update: 2025-08-17 03:47 GMT

పాలకులు మారినా గిరిజనుల తలరాతలు మారడం లేదు. డోలీ కష్టాలు తప్పడం లేదు. అనేక గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో గిరిజన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా అవి అమలులోకి రావడం లేదు. అలాగే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు సయితం ఆచరణకు నోచుకోవడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు ఏ మాత్రం చిన్నపాటి జ్వరం వచ్చినా సరే వారు ఆసుపత్రికి రావాలంటే అష్టకష్టాలు పడాల్సిందే.

మారుమూల ప్రాంతాలకు...
ఇంకా డోలీ మోతలు గిరిజనులకు తప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గర్భిణిల డోలీమోత కొనసాగుతూనే ఉంది. అల్లూరి సీతా రామరాజు మండలంలోని మారుమూ ల గ్రామాలకు చెందిన గిరిజనులు రహదారి సౌకర్యం లేక గర్భిణిలను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వాగులు వంకలు దాటాలి ప్రాణాల ను సైతం పణంగా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో గర్భిణులు సమయానికి ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
చింతలపాలెం గ్రామానికి చెందిన...
ఇటీవల గర్భిణి మహిళ పడిన కష్టాలు చెప్పలేని పరిస్థితి. చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్రా జానకి నిండు గర్భిణి కావడంతో ఆమెకు పురిటి నొప్పులు అధికమయ్యా యి. దీంతో ప్రసవానికి పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని భావించారు. కానీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవ డంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలిం చేందుకు సిద్ధమయ్యారు. చింతలపాలెం నుంచి సుమారు కిలోమీటరు మేర డోలీపై తీసుకువచ్చారు. బూసిపుట్టు సమీపంలోకి వచ్చేసరికి పూర్తిగా దారిలేకపోవడం, వర్షాలకు కొండవాలును ఆనుకుని వరద నీరు ప్రవహించడం తో సుమారు కిలోమీటరు మేర నిండు గర్భిణిని నడిపించాల్సి వచ్చింది.
నాలుగు కిలోమీటర్లు...
అక్కడ నుంచి కొండిభకోట వరకు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకువచ్చి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను అతి కష్టం మీద దాటించారు. అక్కడ నుంచి కొంతదూరం మోసుకు వచ్చి రేగుళ్లపాలెం మెయిన్‌రోడ్డు నుంచి ఫీడర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పలు మండలాలలో ని గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక అష్టకష్టాలు పడుతున్నామని, ఇప్పటి కైనా పలు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా తమ గోడును వింటున్న అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వారు మొరపెట్టుకుంటున్నారు. తమ బాధలను గుర్తించి తమకు డోలీ బాధల నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు.


Tags:    

Similar News