YSRCP : ఎమ్మిగనూరు నాదంటే.. నాది.. పట్టువదలని నేతలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొకవైపు పార్టీ నేతలు మాత్రం వెనక్కు లాగుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొకవైపు పార్టీ నేతలు మాత్రం వెనక్కు లాగుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రమయింది. మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక రెండు వర్గాలుగా విడిపోయి పార్టీని వీధిల పాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం మూడేళ్లకు ముందే ఆధిపత్య పోరు మొదలయింది. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బుట్టా రేణుక వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత కూడా బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు.
అప్పటి నుంచి మొదలు...
అయితే మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాత్రం తమ వర్గం బుట్టా కు మద్దతివ్వమని తెగేసి చెప్పడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ బుట్టారేణుకను కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ ఛార్జిగా రాజీవ్ రెడ్డిని నియమించారు. కానీ ఈ నియామకాలు కూడా ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇంకా ముదిరాయి. ఈ రెండు వర్గాలు వేర్వేరుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. పర్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా ఇబ్బందికరంగా మారింది. అయితే వైఎస్ జగన్ సలహా మేరకు కర్నూలు, నంద్యాల జిల్లా నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డిలు రెండు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేశారు.
ఇద్దరూ మొండిపట్టుపట్టడంతో..
కానీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు నుంచి వెళ్లిపోవడానికి ఇష్టపడటం లేదు. అక్కడ తన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉండటంతో ఈసారి శాసనసభలో అడుగు పెట్టాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే రాజీవ్ రెడ్డి కూడా తన తండ్రి చెన్న కేశవ రెడ్డి లెగసీని రాజకీయంగా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రం కావడంతో కార్యకర్తలతో పాటు పార్టీ నాయకత్వానికి కూడా తలనొప్పిగా మారింది. సెకండ్ లెవెల్ క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఇక నేరుగా జగన్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. మరి జగన్ జోక్యం చేసుకుంటారా? విభేదాలను పరిష్కరిస్తారా? అన్నది చూడాలి.