Kadapa Tdp : ఆ... కడపోళ్లకు క్లాస్ పీకయ్యా.. లేకపోతే.. ఇక అంతే సంగతులు

కడప జిల్లాలో కూటమి పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. మద్యం, ఇసుక వ్యాపారాల్లో ఆధిపత్యం కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి

Update: 2025-01-18 08:34 GMT

కడప జిల్లాలోని కూటమి పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. మద్యం, ఇసుక వ్యాపారాల్లో ఆధిపత్యం సాధించేందుకు మూడు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు వీధిన పడుతున్నాయి. ఇది ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూర్చేరకంగా తయారయింది. కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పార్టీలు ఈసారి పది నియోజకవర్గాలకు గాను ఏడింటిలో గెలిపించారు. ప్రజలు కూటమి నేతలను అక్కున చేర్చుకున్నారు. అయితే గెలిచింది తమ ప్రతిభతోనేనన్న గర్వంతో పార్టీల నేతలు తమ అనుచరులకు లబ్ది చేకూర్చేందుకు రెడీ అయ్యారు. ఆదాయం వచ్చే ఏ పనినీ వదిలిపెట్టకుండా అందిన కాడికి దండుకునే ప్రయత్నాలను మొదలుపెడుతుండటంతో ఇప్పుడు టీడీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది.

కూటమిపార్టీల మధ్య...
ఆ మధ్య జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఫ్లైయాష్ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంతవరకూ సద్దుమణగలేదు. ఎవరి నియోజకవర్గంలో వారు ఇప్పటికే మద్యం దుకాణాలను తమ అనుచరులకు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ టీడీపీదే సహజంగా పై చేయి కావడంతో జనసేన, బీజేపీ స్థానిక నేతలు గుర్రుమంటున్నారు. కనీసం తమకు అవకాశం ఇవ్వడం లేదని, ఎన్నికలప్పుడు తమ అవసరం కనిపించింది కానీ, వ్యాపారాలకు వచ్చే సరికి తాము కనిపించకుండా పోయామని జనసేన నేతలు ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
గ్రూపుల కొట్లాటలు...
ఇక తెలుగుదేశం పార్టీలో కూడా సక్రమంగా ఉందంటే అదీ లేదు. అందులో కూడా గ్రూపుల కొట్లాటలు పార్టీని దెబ్బతీస్తున్నాయి. పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ఎందుకు గెలిపించామురా బాబూ అంటూ జనాలు అనుకునే పరిస్థితికి టీడీపీ నేతలే తీసుకువస్తున్నట్లు కనపడుతుంది. టీడీపీ నేతల్లో గ్రూపులుగా విడిపోయి మద్యం, ఇసుక వ్యాపారాల్లో తమ అనుచరులను భాగస్వామ్యులను చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటించేలా ఉన్నాయి. అసలే అది జగన్ కు సొంత జిల్లా. అలాంటి చోట అధికారం వచ్చింది కదా? అని విర్రవీగితే మరోసారి వైసీపీ బలం పుంజుకునే అవకాశాలు లేకపోలేదన్న ఆందోళన తెలుగుదేశం పార్టీఅభిమానుల్లో వ్యక్తమవుతుంది.
ప్రతి నియోజకవర్గంలో...
తాజాగా ఇసుక టెండర్లలో బీటెక్ రవి అనుచరులు స్థానిక టీడీపీ నేతలపైనే దౌర్జన్యానికి దిగడం చర్చనీయాంశమైంది. అంతేకాదు వారిని టెండర్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్థానిక టీడీపీ నేతలు తిరగబడుతున్నారు. కడప ఎమ్మెల్యే మాధవి అనుచరులు, కమలాపురం ఎమ్మెల్యే అనుచరుల మధ్య కూడా ఇటీవల వివాదం చోటు చేసుకోవడం పార్టీ పరిస్థితిని అద్దం పడుతుంది. చివరకు రేషన్ షాపుల కేటాయింపులోనూ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే ఉంది. ఇక ప్రొద్దుటూరులోనూ ఎవరి దారి వాళ్లదే. ఈరోజు చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా నేతలతో సమావేశమై వారిని క్రమశిక్షణలో పెట్టాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు. లేకుంటే మరింత ఇబ్బందులు భవిష్యత్ లో తప్పవని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News