Helicopter : చంద్రబాబు ప్రయాణించే హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక లోపం

ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ ప్రయాణించే హెలికాప్టర్ కు సాంకేతిక సమస్యలపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు

Update: 2025-06-17 02:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ ప్రయాణించే హెలికాప్టర్ కు సాంకేతిక సమస్యలపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు.చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలకు వెళ్తున్నప్పుడు జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ను వాడుతుంటారు. అయితే, ఈ హెలికాప్టర్ తో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని...
తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. అమరావతి నుంచి ఆ హెలికాప్టర్ లోనే తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు. తరచూ ఈ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ వినియోగించవచ్చా? లేదా? స్పష్టంగా పేర్కొంటూ ఒక నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి నివేదికలు అందిన తర్వాత మాత్రమే హెలికాప్టర్ ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.


Tags:    

Similar News