TDP : దేవినేని ఆశలు నెరవేరేటట్లు లేవుగా.. శత్రువులదే పై చేయి అయినట్లుందిగా

దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగుతుంది

Update: 2025-05-10 07:28 GMT

దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగుతుంది. టీడీపీలో దేవినేని సీనియర్ నేత. సోదరుడు దేవినేని వెంకటరమణ హఠాన్మరణంతో దేవినేని ఉమ హటాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్‌డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్‌ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమ మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం తొలిసారి ఓటమి పాలయ్యారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు దేవనేని ఉమ వ్యవహరించిన తీరు ఆయనకు శాపంగా మారిందని అంటున్నారు.

కీలక నేతగా ఉన్న...
నిజానికి కృష్ణా జిల్లాలో కీలక నేతగా దేవినేని ఉమ వ్యవహరించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచారు. అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ముందుండే వారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన మైలవరం నుంచి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. చంద్రబాబు కూడా దేవినేని ఉమకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తనంతట తానుగానే శత్రువులను పెంచుకున్నారు. దేవినేని వెంట చిన్నా చితకా నేతలు తప్ప ఒక స్థాయి నేతలు ఎవరూ ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. అనేక మంది దేవినేని ఉమకు వ్యతిరేకంగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు.
టిక్కెట్ దక్కకపోగా...
కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ ఉంటే తమ మాట చెల్లుబాటు కాదన్న నిర్ణయానికి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారంటే ఆయన ఏ స్థాయిలో పార్టీలో ఆధిపత్యాన్ని చెలాయించడంతోనే తనకు తెలిసి కొందరిని, తెలయకుండా మరికొందరని శత్రువులను పెంచుకుంటూ పోయారు. దీంతో గత ఎన్నికల్లో దేవినేని ఉమకు టిక్కెట్ కూడా దక్కలేదు. మైలవరం నియోజకవర్గం నుంచి అప్పటికప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీ నాయకత్వం టిక్కెట్ ఇచ్చింది. ఆరోజే దేవినేని శత్రువర్గం సక్సెస్ అయ్యారనుకోవాలి. ఎందుకంటే సీనియర్ నేతకే టిక్కెట్ లేకపోవడంతో బయట నేతలు ఆశ్చర్యపోయినా ఆ విషయంకృష్ణా జిల్లా నేతలకు స్పష్టంగా తెలుసు. ఇప్పటికీ చంద్రబాబు, లోకేశ్ కు దేవినేని ఉమ సన్నిహితంగానే ఉంటారు.
భవిష్యత్ లో కూడా...
కానీ గత ఏడాది నుంచి ఆయనకు ఏ పదవి దక్కడం లేదు. వచ్చిన పదవులన్నీ భర్తీ అయిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం నేతలకు ఇవ్వాలంటే గుంటూరు జిల్లాలో కూడా వారే పోటీ పడుతున్నారు. ఈ సమయంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలకు చంద్రబాబు పదవులు ఇవ్వడం కష్టంగా మారింది. కూటమి ప్రభుత్వం గెలుపొందిన తొలినాళ్లలో దేవినేని ఉమ ఎమ్మెల్సీ అవుతారని అనుకున్నారు. కానీ ఆయన వైపు అధినాయకత్వం చూడలేదు. ఇక ముందు కూడా ఆయన వైపు చూసే అవకాశం లేదని తెలిసింది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో బలమైన నేతలు పోటీ పడుతుండటంతో దేవినేని ఉమ ఈ టర్మ్ లో పదవి లేకుండానే కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. దేవినేనికి జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News