Pawan Kalyan : పవన్ సర్వే చేయిస్తున్నారా? ఈసారి ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు

Update: 2025-05-30 07:50 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. దానంతట అదే బలపడుతుందన్నది ఆయన నమ్మకం కావచ్చు. క్యాడర్ తో పాటు అభిమానులు, క్యాస్ట్ కూడా తనకు కలసి వస్తుందని, అదే తనను ఎన్నికల నాటికి బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. అందుకే పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతంపై ఫోకస్ పెట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమితోనే కలసి పోటీ చేస్తున్నామన్న క్లారిటీ రావడంతో పవన్ కల్యాణ్ నియోజకవర్గాల ఇన్ ఛార్జిల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. అనవసరంగా ఎక్కువ మందిని నియమించుకుని, వారు ఏదో వివాదంలో చిక్కుకుని పార్టీకి, తనకు చెడ్డపేరు తెస్తారన్న భయం మాత్రం పవన్ కల్యాణ్ లో కనిపిస్తుంది.

ఎంపికయిన వాటిలోనే...
అందుకే ముందుగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో నమ్మకమైన నేతలను, సుదీర్ఘకాలం నుంచి పార్టీతో నడుస్తున్న వారికి మాత్రమే ఇన్ ఛార్జి పదవులును కట్టబెడుతున్నారు. అంతే తప్ప 175 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జుల నియమించి, అక్కడ టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేనలకు మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయని భావిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకూ చాలా నియోజకవర్గాల్లోనూ ఇన్ ఛార్జులు లేరు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తాను తీసుకోవాల్సిన స్థానాలపై కూడా అంచనా రావడానికి ఒక సర్వే చేయించాలని కూడా పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని తెలిసింది. పేరున్న సంస్థ చేత సర్వేచేయించి జనసేనకు బలం ఉన్న యాభై నియోజకవర్గాల పేర్లను ఆయన తెప్పించుకోవాలని భావిస్తున్నారు.
ఆ నియోజకవర్గాల్లోనే...
ఢిల్లీకి చెందిన సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. సర్వేలో వచ్చిన స్థానాలను అడిగి తీసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆ సర్వే వచ్చిన తర్వాత ఆ స్థానాల్లో ఇన్ ఛార్జులు లేకపోతే అప్పుడు అక్కడ నమ్మకమైన వారిని నియమించడమా? లేదా తనకు దగ్గరగా ఉన్న నేతలను అక్కడ ఇన్ ఛార్జులుగా పెట్టడమా? అన్నది చేస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. యాభై నుంచి అరవై బలమైన అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంటు స్థానాల పేర్లను కూడా తనకు సర్వే చేసి ఇవ్వాలని సదరు సంస్థకు పవన్ కల్యాణ్ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. అదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో జనసేన ఐదు పార్లమెంటు, యాభై శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News