Pawan Kalyan : పవన్ ఆలోచన అదేనట.. బలం పెంచుకుంటేనే తప్ప?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇక జిల్లాల్లో యాక్టివ్ గా ఉండే నేతలకు పదవులు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇక జిల్లాల్లో యాక్టివ్ గా ఉండే నేతలకు పదవులు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేవలం ఒక జిల్లాకు మాత్రమే జనసేన పరిమితమయిందన్న ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలిసింది. గత కొద్ది రోజులుగా పదవులు పంపిణీ లో ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా నేతలకే ఎక్కువ పదవులు దక్కాయ్యన్న విమర్శలు రావడంతో ఆయన ఈసారి భర్తీ అయ్యే పదవుల విషయంలో ఇటు రాయలసీమతో పాటు అటు కోస్తాంధ్రలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉండే నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రధానంగా వీరమహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతుండటంతో...
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. దీంతో మొన్న పోటీ చేసిన స్థానాలకు తోడు మరికొన్ని స్థానాలను పొత్తులో భాగంగా తీసుకునే అవకాశముంది. దాదాపు యాభై స్థానాలు వచ్చే ఎన్నికల నాటికి పెరగనుండటంతో అందులో కనీసం పది నుంచి పదిహేను స్థానాలను జనసేన తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తమకు కొద్దో గొప్పో బలమున్న ప్రాంతాల్లో పోటీ చేస్తే అక్కడ టీడీపీ కూడా తమ పార్టీ అభ్యర్థికి సహకరిస్తుంది కాబట్టి ఈసారి ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్లవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కువగా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమపై కూడా దృష్టిపెట్టినట్లు తెలిసింది.
సీమ, ఉత్తరాంధ్రలలో...
మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో తిరుపతి, రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కడప జిల్లాలోనూ పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో కూడా పట్టు పెంచుకోవాలని యోచిస్తున్నారు. ఇక ఎటూ చిత్తూరు జిల్లాలో పోటీ చేయడం గ్యారంటీ. బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉందని తెలిసింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో కూడా గత ఎన్నికల్లో కేవలం కొన్ని స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ఆ ప్రాంతంపై గ్రిప్ ను పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారట. అందుకోసమే అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
యాక్టివ్ లేకపోవడానికి...
పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందే యాక్టివ్ గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామన్న అసంతృప్తి ఒకవైపు ఉన్నప్పటికీ అందుకు ఖజానా సహకరించడం లేదన్నది కేవలం నెపం మాత్రమేనని ఆయన గుర్తించారు. అందుకే తన బలం పెంచుకుని మిత్ర పక్షంగా మౌనంగా ఉండకుండా వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి పాలనపై పట్టు బిగించాలన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలిసింది. మొత్తం మీద పవన్ కల్యాణ్ దీర్ఘకాలిక ప్రణాళికతోనే వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పర్యటించి పార్టీని బలోపేతం చేయడంపై పవన్ దృష్టి పెట్టారట.