Montha Cyclone Effect : మొంథా తుపాను ఎఫెక్ట్... అలజడిలో ఆంధ్రప్రదేశ్

మొంథా తుపాను తీవ్ర తుపాను గా మారి తీరాన్నితాకింది.

Update: 2025-10-28 14:05 GMT

మొంథా తుపాను తీవ్ర తుపాను గా మారి తీరాన్నితాకింది. తీరం సమీపానికి చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొంథా తుపాను రాజోలు - అల్లవరం మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి11.30 గంటల తర్వాత తీరం దాటే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా తీర ప్రాంతంతో పాటు కోనసీమ ప్రాంతం ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశముందని తెలిపింది. ఇళ్లలో నుంచి బయటకు ఎవరూ రావద్దని అధికారులు సూచించారు

ఈ జిల్లాల్లో అధికంగా...
తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్ టి జి ఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా జిల్లాలనుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది.
అత్యవసర సేవల కోసం...
అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది. ఆయా జిల్లాల్లోని ప్రజలంతా ఇండ్ల లోనే ఉండాలని, బయటకు రావద్దని, అప్రమత్తతతో మెలగాలని సూచించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తుంది.


Tags:    

Similar News