Montha Cyclone : తీరం దాటిన మొంథా తుపాను.. నేడు కూడా భారీ వర్షాలు
మొంథా తుపాను తీరం దాటింది. పెద్దగా ప్రమాదం సంభవించకుండానే తీరం దాటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
మొంథా తుపాను తీరం దాటింది. పెద్దగా ప్రమాదం సంభవించకుండానే తీరం దాటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి కోస్తాంధ్ర ప్రాంతాన్ని భయపెట్టిన మొంథా తుపాను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. మచిలీపట్నం -కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో మొంథా తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటినప్పటికి ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నానికి మొంథా తుపాను మరింత బలహీనపడే అవకాశముందని, తెలంగాణ మీదుగా ప్రయాణించి ఛత్తీస్ గఢ్ వద్ద మరింత బలహీన పడుతుంది.
బలమైన గాలులు వీస్తాయని...
అయితే ఈ ప్రభావంతో తీరం వెంట గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో కోస్తా తీర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శఆఖ తెలిపింది. అలాగే ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు మరొక ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగానే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈరోజు కూడా ఇళ్లలోనే...
అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్తు స్థంభాలు వద్ద నిలబడరాదని, పునరావాస కేంద్రాల్లోనే ఈరోజు కూడా తలదాచుకోవాలని, సాయంత్రానికి వర్షం శాంతించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మొంథా తుపాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటలు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.