Cyclone Alert : దూసుకొస్తున్న మొంథా తుపాను.. అలెర్ట్ గా లేకపోతే అంతే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-10-27 01:30 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం నైరుతి - పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపానుకు మొంథా గా నామకరణం చేసిన అధికారులు ఇప్పటికే రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు తీవ్ర తుపానుగా మారి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు...
రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొంథా తుపాను ముప్పుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావాలని, ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటే మంచిదని సూచించింది. ఆంధ్రప్రదేళ్ ను మూడు జోన్లుగా వర్గీకరించింది. రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా వర్గీకరించింది. రెడ్ జోన్ లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.
విద్యాసంస్థలకు సెలవు...
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు రావాలని పేర్కొంది. రెడ్ జోన్ లో ఉన్న జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ లకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. అధికారులకు సెలవులను రద్దు చేసింది. అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. పరిస్థితి తీవ్రతను బట్టి ఎల్లుండి కూడా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్తీక మాసం కావడంతో ఎవరూ నదుల్లోనూ, సముద్రాల్లోనూ స్నానాలు చేయడానికి రావద్దని కూడా తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, విద్యుత్తు సౌకర్యానికి అంతరాయం కలగవచ్చని పేర్కొంది.
తెలంగాణలో నాలుగు రోజులు...
తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. ఈరోజు నాగర్ కర్నూల్, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్త గూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Tags:    

Similar News