Cyclone Alert : 1996 తుపాను కు మించిన ముప్పు... ఇళ్లను వదలి బయటకు రాకండి... హెచ్చరిక

మొంథా తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది

Update: 2025-10-27 04:20 GMT

నైరుతి,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్ ముప్పు పొంచి ఉంది. గడిచిన మూడు గంటల్లో గంటకు 18కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంథా తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు కాకినాడకి 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రభావంతో తీరం వెంట గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండవద్దని అధికారులు హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
1996 తుపాను కు మించి ఈ తుపాను వచ్చే అవకాశముందని అంచనా వినిపిస్తుంది. ప్రజలు వీలయినంత వరకూ బయటకు రావద్దని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.
రేపు రాత్రికి కాకినాడ సమీపంలో...
రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. వదంతులను నమ్మవద్దని ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని అధికారులు తెలిపారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలని, వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజల భద్రత మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో "అత్యవసర వస్తు సామగ్రిని" సిద్ధం చేసుకోవాలని కూడా ప్రభుత్వ అధికారుల సూచించారు. ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలని కోరుతున్నారు.
విద్యుత్తు మెయిన్ స్విచ్ ను...
ఈదురుగాలులు వీచే సమయంలో అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్స్ మరియు విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్ లో ఉంచాలని అధికారులు మార్గదర్శనం చేశారు. ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలని, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షలను తీసివేయాలని, తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచాలని కోరారు. మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవాలని కోరారు. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల కింద ఎప్పుడూ ఉండవద్దని, పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.


Tags:    

Similar News