Tirumala : తిరుమలలో పెరిగిన భక్తు రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్దిరోజులుగా భక్తుల రద్దీ తక్కువగా ఉంది. పాక్ - భారత్ సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమలకు రాలేకపోయారు. దీంతో భక్తులు గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగానే వచ్చారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాటు రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో మళ్లీ భక్తుల రద్దీ ఎక్కువయిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేటి నుంచి సిఫార్సు లేఖలు...
మరోవైపు నేటి నుంచి సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రకటించారు. భక్తుల రద్దీ తగ్గడంతో తిరిగి సిఫార్సు లేఖలను స్వీకరించాలని నిర్ణయించారు. మే 1వ తేదీ నుంచి జులై పదిహేనో తేదీ వరకూ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని చెప్పిన టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను నేటి ంనుిచ అనుమతి ఇస్తారు. భక్తులకు రేపటి నుంచి సిఫార్సు లేఖలపై దర్శనం లభిస్తుంది.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనంటిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,020 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,190 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.