Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా.. అయితే దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది

Update: 2026-01-05 03:17 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. సామాన్యులకు దర్శనం కల్పించనుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముందుగా వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు తీసుకోకపోయినా తిరుమల వచ్చిన వారందరికీ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ప్రకటనతో భక్తులు గత కొద్ది రోజులుగా తిరుమలకు పోటెత్తుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది.

రోజుకు ఎనభై వేల మందికి పైగానే...
గత కొన్ని రోజుల నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి ఎనభై వేల మందికి పైగానే భక్తులు రోజూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కానీ అంత పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ టీటీడీ అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రేపు వైకుంఠ ద్వార దర్శనానికి స్థానికులకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించిన నేపథ్యంలో నేడ కూడా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దర్శనానికి గంటల సమయం పడుతుంది.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా స్వామి వారిని దర్శించుకునే భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,179 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,831 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.79 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News