Andhra Pradesh : సీమలో పట్టు నిలుపుకోవడానికేనా? జగన్ కు చెక్ పెట్టేందుకే

రాయలసీమపైనే కూటమి ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. సీమలో తమ పట్టును నిలుపుకోవాలన్న ప్రయత్నం కనపడుతుంది.

Update: 2025-09-10 07:58 GMT

రాయలసీమపైనే కూటమి ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. సీమలో తమ పట్టును నిలుపుకోవాలన్న ప్రయత్నం కనపడుతుంది. ఇటీవల మహానాడును కూడా కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ తాజాగా నేడు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాల్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. రాజకీయంగా పట్టు సాధించేందుకు మాత్రమే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి గతంలో పట్టు ఉండేది. 2019 ఎన్నికల్లో కేవలం ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ మూడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.

మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్...
అయితే 2024 లో జరిగిన ఎన్నికల్లో రాయలసీమలో సీన్ రివర్స్ అయింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో వైసీపీకి ఐదు స్థానాలు వచ్చేసరికి గగనమయింది. చిత్తూరు జిల్లాలో రెండు, కడప జిల్లాలో మూడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జీరో స్థానాలకు మాత్రమే పరిమితమయింది. జగన్ సొంత జిల్లా కడపలో పది స్థానాలు ఉంటే అందులో ఏడు స్థానాల్లో కూటమి గెలుచుకోగలిగింది. రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం, ఆధిపత్యం ఉన్న చోట కూటమి పార్టీలు జెండాను ఎగురవేయగలిగాయి. అయితే ఇదే పట్టును కొనసాగించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తరచూ రాయలసీమ జిల్లాల్లో ఇటు చంద్రబాబు నాయుడు, అటు నారా లోకేశ్ లు పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లోనూ, నేతల్లోనూ జోష్ తెప్పిస్తున్నారు.
ఎక్కువగా అక్కడే పర్యటిస్తూ...
మరొకవైపు కూటమి పార్టీలకి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి నుంచి గట్టి పట్టు ఉండటంతో పాటు వైసీపీకి తగిన బలం లేదని భావిస్తున్న కూటమినేతలు రాయలసీమలో వైసీపీ పుంజుకునే అవకాశముందని భావించి ఎక్కువగా ఆ జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో తరచూ పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు భారీ బహిరంగ సభ పేరుతో రాయలసీమను టార్గెట్ చేస్తూ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు రెండు లక్షల మందిని జనాన్ని సమీకరించాలని నేతలు శ్రమిస్తున్నారు. ఈ సభకు మూడు పార్టీల అగ్రనేతలు హాజరై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం అభివృద్ధి పనులు చేశామో.. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన విధానాన్ని వివరించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు.


Tags:    

Similar News