Andhra Pradesh : కూటమికి ఓటమి లేదట.. హ్హ.. హ్హ.. హ్హ..అదే భ్రమల్లో ఉండండి
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అతి విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా పూర్తి భరోసాతో ఉన్నారు
అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు అతి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇక మనకు తిరుగేలేదనిపిస్తుంది. మరో కొన్ని దశాబ్దాల పాటు తమదే విజయం అని భ్రమిస్తుంది. అది ఎవరికైనా అంతే జరగుతుంది. అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టరే కనపడుతుంది. గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా 151 నియోజకవర్గాల్లో గెలుపు సాధించగాలనే ఆయనను ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇక మరో ముప్ఫయేళ్లు తానే సీఎం అని చెప్పుకొచ్చారు. టీడీపీ పూర్తిగా పతనమయిందని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అదే తరహాలో కనిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి 2029 ఎన్నికల్లోనూ తమదే విజయం అని గట్టిగా నమ్ముతున్నారు.
ఏడాదిలోనే ఇంత వ్యతిరేకతా?
తాము చేస్తున్నసంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి తమను మరోసారి అందలం ఎక్కిస్తుందని గుడ్డి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. ఎమ్మెల్యేలపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చంద్రబాబు ఎంత కష్టపడినా, పవన్ కల్యాణ్ తాను నీతి నిజాయితీగా ఉన్నానని చెబుతున్నప్పటికీ లోకల్ పాలిటిక్స్ కూటమిని గెలుపుదిశగా నడిపించలేవన్న విషయాన్ని గ్రహించాలి. ఎమ్మెల్యేలు చేస్తున్న పనికి ఏం చర్యలు తీసుకున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలను మార్చినా, వారి ప్రభావం ఖచ్చితంగా నియోజకవర్గంలో పడుతుందని గత ఎన్నికల్లో వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ అని గుర్తుంచుకుంటే మంచిది.
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు...
గత ఎన్నికల్లో 164 స్థానాల్లో కూటమి గెలిచిన తర్వాత ఎక్కువమంది నియోజక వర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సామంతరాజుగా మారిపోయారు. అక్కడ చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలు చెల్లుబాటు కావు. ప్రతిపక్ష బలహీనంగా ఉండటంతో చంద్రబాబు గుడ్డినమ్మకంతో ముందుకు వెళుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా వైసీపీని ఇక అధికారంలోకి రానిచ్చేది లేదని బీరాలు పలుకుతున్నారు. కాని 2024 వరకూ ఆ మాటలను జనం నమ్మారు. ఇక పవన్ కల్యాణ్ మాటలను కూడా జనం విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. ఎంత చెప్పినా, ఎన్ని శపథాలు చేసినా.. ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ రాజకీయాలనేవి అందలం ఎక్కించినంత సులువుగానే కిందకు పడేస్తాయన్నవిషయాన్ని మరచి ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.
ఎంత బాగా పాలించినా...
ఎంత బాగా పరిపాలన చేసినా.. ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా.. ఇదిగో అభివృద్ధి అని చాటి చెప్పినా ప్రజలు మార్పు కోరుకుంటారు. అది చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను చూసి ఓటెయ్యరు. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్ల పాటు వ్యవహరించిన తీరును బేరీజు వేసుకుని జనం ఓట్లేస్తారు. పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది ఎవరు వచ్చినా జరుగుతుందన్న నమ్మకం జనంలో ఉంటుంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చూసి మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అది పార్టీలకు శాపంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. అందుకే గుడ్డిగా నమ్మకుండా మరో నాలుగేళ్ల సమయంలో ఏదైనా పెనుమార్పులు తీసుకు రాగలిగితే తప్ప కూటమి ఓటమి నుంచి బయటపడే అవకాశాలు లేవన్నది విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి.