Andhra Pradesh : నేడు అనంతపురంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభ
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు సూపర్ సిక్స్ పథకాలపై సూపర్ హిట్ సభను నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు సూపర్ సిక్స్ పథకాలపై సూపర్ హిట్ సభను నిర్వహిస్తుంది. అనంతపురంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మూడు కూటమి పార్టీలకు చెందిన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
కూటమి ప్రభుత్వం నేతృత్వంలో...
సాయంత్రం జరగనున్న ఈ సభలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన విధానాన్ని వివరించనున్నారు. ఏ ఏ పథకాన్ని ఇప్పటి వరకూ అమలు చేయగలిగామో ప్రజలకు వివరించనున్నారు. అలాగే ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి కూడా ప్రజల ముందు పెట్టనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు రెండు లక్షల మంది ప్రజలను తరలించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు.