భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష : వారికి రూ.10వేలు ఇవ్వండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, అధికారులను ఆదేశించారు. గోదావరిలో నీటి..

Update: 2023-07-28 12:30 GMT

cm jagan meeting on rains and floods

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లాకలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, నదుల ప్రవాహం, వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు. 42 మండలాల్లో 458 ముంపు గ్రామాలను గుర్తించి అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, అధికారులను ఆదేశించారు. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రేపు గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు పంపించేటపుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు అందజేయాలని, ఒక వ్యక్తి అయితే రూ.1000 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దెబ్బతిన్న ఇళ్లను(కచ్చా ఇళ్లు) మరమ్మతులు చేయించుకునేందుకు రూ.10 వేలు, ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ అందజేయాలని తెలిపారు. సచివాలయ స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని చెప్పారు. సహాయక చర్యలకై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.


Tags:    

Similar News