మళ్లీ ఊపందుకున్న చికెన్ అమ్మకాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చికెన్ అమ్మకాలు ఎక్కువయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చికెన్ అమ్మకాలు ఎక్కువయ్యాయి. నిన్నటి వరకూ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరంగా ఉన్న మాంసం ప్రియులు తిరిగి దానిని కొనుగోలు చేసేందుకు దుకాణాలకు క్యూ కట్టారు. ఆదివారం చికెన్ అమ్మకాలు జోరుగా జరిగినట్లు చెబుతున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ సోకి లక్షల కోళ్లు మృతి చెందడంతో చికెన్ తినడానికి కూడా భయపడిపోయారు.
ధరలు తగ్గించినా...
చికెన్ కిలో ధరలు తగ్గించి విక్రయించినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చికెన్ విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో చికెన్ తింటే ఏమీ కాదని అవగాహన కల్పించడం కోసం మేళాలను ఏర్పాటు చేశారు. ఉచితంగా చికెన్ పదార్థాలను పంచిపెట్టారు. దీంతో చికెన్ కొనుగోలు చేసేందుకు అనేక మంది ముందుకు వస్తుండటంతో మాంసం దుకాణాలు మళ్లీ కళకళలాడుతున్నాయి.