Chadrababu : వీలయితే నాలుగు మంచి మాటలు... కాసినన్ని ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తెలిసి వచ్చింది. జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉందని భావించిన చంద్రబాబు ఆ పార్టీకి దూరమయ్యే ఆలోచనలు ఇకపై చేయకపోవచ్చు. ఇప్పటికే కూటమిలో నాలుగో సారి ఉండటంతో ఈసారి మాత్రం బీజేపీ నాయకత్వం పై చాల ఎక్కువ ప్రేమను ఒలకబోస్తున్నారేమిటో అన్నది తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ ఇలా ప్రశంసలు కానీ, పొగడ్తలు కానీ చేయలేదు. కాకపోగా.. తనకంటే దేశంలో సీనియర్ రాజకీయ నేత ఎవరున్నారంటూ ప్రశ్నించిన సందర్భాలు.. సమావేశాల్లో అన్న వ్యాఖ్యలు ఇప్పుడు అస్సలు వినపడటం లేదు. గతంలో అనేక సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత విడిపోవడం వెంటవెటనే జరిగేది. కానీ ఈసారి అలా కాదు.
ఈ టర్మ్ లో మాత్రం...
వీలుంటే మోదీ మీద నాలుగు మంచి మాటలు.. పార్టీపై కాసిని ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం బీజేపీతో పెట్టుకుంటే తాము 2019 ఎన్నికలలో ఏమయ్యామో అర్థమయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పేవారు. నాడు వాజ్ పేయి హయాం నుంచి మొదలు పెడితే చాలా సార్లు ఆయన మాట హస్తినలో వేదంగా మారింది. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరమయినా సరే కనీసం హస్తిన లో వేలు పెట్టేందుకు ఆయన ప్రయత్నం చేయడం లేదు. వీలుంటే తమ రాష్ట్రానికి కాసింత సాయం చేయమని అడుగుతున్నారే కానీ, ఎలాంటి బెదిరింపులు.. హెచ్చరికలు ఇప్పుడు చంద్రబాబులో కనిపించడం లేదు.
బీజేపీకి దూరమయితే...
ఎందుకంటే తాను బీజేపీని వదులుకుంటే వెంటనే జగన్ కు ఆ పార్టీ మరింత దగ్గరవుతుంది. దానివల్ల రాజకీయంగా తాము నష్టపోతామని చంద్రబాబు భావించడం వల్లనేనన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు. అందుకే మోదీ వద్ద బెదిరింపులు.. హెచ్చరికలు పనిచేయవని, కేవలం బతిమాలి.. మెచ్చుకోలు మాటలు చెప్పి రాష్ట్రానికి అవసరమైన మూటలు తెచ్చుకోవడమే మంచిదని చంద్రబాబు నాయుడుకు నాలుగో సారి కాని అర్థం కాలేదని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో ఏ సంక్షేమం జరిగినా దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీని కూడా నాలుగు ముక్కలు కొనియాడి తర్వాత కాని జనసేన, టీడీపీ ప్రస్తావన తేవడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి అన్న నినాదం అందుకోవడమేకాకుండా, ఇటీవల నెహ్రూపై చంద్రబాబు చేసిన విమర్శలు చూస్తే పార్టీనేతలే మా నేతలో ఎంత మార్పు అని ఆశ్చర్యపోతున్నారు.