Chandrababu : బాబు ఢిల్లీ పర్యటనై ఊహాగానాలు ఊపేస్తున్నాయటగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావిడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావిడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేవలం కొద్ది గంటలు మాత్రమే ఢిల్లీలో ఆయన ఉన్నారు. అదీ కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం కోసమే ప్రత్యేకంగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అయితే చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిసింది రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసమేనని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు నిధుల విడుదల, రానున్న బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ విషయాలయితే ప్రధాని నరేంద్ర మోదీ, లేకుంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవాలని, అమిత్ షాను కలవడంలో ఆంతర్యమేంటని కొందరు విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
చేసిన వ్యాఖ్యలు...
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లేముందు పోలవరం ప్రాజెక్టు సందర్శనలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, ముప్ఫయి ఏళ్లు విచారించినా కేసులు కొలిక్కి రావని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత కలవరం మొదలయింది. మరొకవైపు ఇటీవల కడప జిల్లాకు చెందిన నేతలు కొందరు అమిత్ షాను కలిసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవడం రాజకీయ కారణాల కోసమేనన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో...
అమిత్ షాకు బడ్జెట్ తో సంబంధం లేదని, అయితే ఆయన ప్రభుత్వంలో నెంబరు 2 కావడంతో ప్రధాని మోదీకి ఉన్న బిజీ షెడ్యూల్ తో ఆయనతో బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై చర్చించడానికే వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాదిలో రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలతో పాటు కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉండటంతో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మొత్తం మీద చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనపై అనేక రాజకీయ ఊహాగానాలు ఏపీని ఊపేస్తున్నాయి. అయితే పర్యటన ఎందుకోసం అన్నది మాత్రం చంద్రబాబు అధికారికంగా చెబితే తప్ప బయటకు వెల్లడయ్యే ఛాన్స్ లేదు.