Andhra Pradesh : నాడు వైసీపీ... నేడు .. టీడీపీ మారే అవకాశం లేదా?

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. రిజర్వ్ డ్ నియోజకవర్గాలపై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుంది

Update: 2025-10-27 09:08 GMT

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. రిజర్వ్ డ్ నియోజకవర్గాలపై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుంది. అది వైసీపీ కావచ్చు. టీడీపీ కావచ్చు. మరేదైనా పార్టీ కావచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదిదే. రాజ్యాంగం ప్రకారం రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో వారిని మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉన్నందున వారిని తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపిక చేస్తున్నారు. గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అగ్రకులానికి చెందిన నేతల ఆధిపత్యం ఆ నియోజకవర్గాల్లో ఉండటం, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నామమాత్రంగా మిగిలిపోవడం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న తంతు ఇదే. దీనికి ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం వారి వెంట పరుగులు తీస్తారు. గెలిచిన తర్వాత మాత్రం అక్కడ వారిని నామమాత్రంగానే మిగిలేలా చేస్తారు.

వైసీపీ హయాంలోనూ...
నాడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కోడుమూరులో కోట్ల విష్ణువర్థన్ రెడ్డి, పాడేరు, రంపచోడవరంలో అనంతబాబు కావచ్చు.. ఇలా అనేక చోట్ల నాడు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడ్డారు. తమ గోడును అధినాయకత్వానికి చెప్పుకున్నా కూడా ఫలితం కనిపించ లేదు. జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ, అక్కడ వారిదే ఆధిపత్యం కావడంతో ఎమ్మెల్యేలనే సర్దుకు పోవాలని బుజ్జగించి పంపారని చెబుతారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో అక్కడి అగ్రకులాలకు చెందిన నేతలు చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుంది. అధికారులు కూడా వారి మాటలనే శిరోధార్యంగా భావిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను లెక్క చేయరు.
టీడీపీ కూడా మినహాయింపు కాదు...
ఇక టీడీపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొవ్వూరు నియోజకవర్గంలో జవహర్ కు టీడీపీకి చెందిన అక్కడ అగ్రకులానికి చెందిన నేతలు ఆధిపత్యం వహించారు. చివరకు ఆయనకు టిక్కెట్ దక్కకుండా చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాటి మంత్రి, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐఆర్ఎస్ అధికారి రావెల కిశోర్ బాబుపై అక్కడ కమ్మ సామాజికవర్గం నేతలు పట్టుబట్టి బయటకు పంపారు. ఎవరో ఒకరో ఇద్దరో తప్పించి ఎవరూ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు వారిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తాజాగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఇదే కోవకు చెందినవిగా భావిస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావుపై ఎంపీ కేశినేని చిన్ని ఆధిపత్యం చూస్తుంటే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు కావస్తున్నా దీనికి మాత్రం తెరపడే అవకాశం కనిపించడం లేదన్న ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతుంది.



Tags:    

Similar News