Bojjala Sudhir Reddy : బొజ్జలకు నోటీసులు ఇచ్చి విచారణతో సరిపెడతారా?
తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు నోటీసులు ఇచ్చారు
తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే ఆయనను విచారించే అవకాశముంది. జనసేన మాజీ నేత కోట వినుత డ్రైవర్ రాయుడి హత్య కేసులో విచారించడానికి చెన్నై పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడిని ఈ హత్య కేసులో విచారించిన నేపథ్యంలో సుధీర్ రెడ్డికి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే బొజ్జల సుధీర్ రెడ్డిని చెన్నై పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. శ్రీకాళహస్తిలో కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
గత ఏడాది జులై 7న హత్య...
గత ఏడాది జులై 7వ తేదీన డ్రైవర్ రాయుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో కోట వినుతతో పాటు అతని భర్త చంద్రబాబును చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రాయుడిని అరెస్ట్ చేసి శవాన్ని చెన్నైలోని ఒక నదిలో పడవేయడంతో చెన్నైలో ఈ హత్య కేసు నమోదింది. చెన్నైకి సమీపంలోని కూపం నదిలో శవం తేలడంతో విచారించిన పోలీసులు కోట వినుత, చంద్రబాబులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పటి వరకూ జనసేన ఇన్ ఛార్జిగా ఉన్న కోట వినుత హత్య కేసులో ఇరుక్కోవడంతో పార్టీ వేటు వేసింది. అయితే కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు మాత్రం తమకు ఈ హత్యతో సంబంధం లేదని చెప్పారు. తమ ప్రమేయం లేదని, కావాలని కుట్ర చేసి ఇరికించారని వారు పోలీసుల విచారణలో తెలిపారు.
ప్రధాన కుట్ర దారు అంటూ...
అంతేకాకుండా ఈ హత్యకు ప్రధాన కుట్ర దారు బొజ్జల సుధీర్ రెడ్డి అని కోట వినుత, చంద్రబాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో రాయుడిని చంపేందుకు ప్రయత్నించారని ఒక వీడియో ద్వారా సుజిత్ రెడ్డితో చెప్పించే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ హత్య కేసులో కోట వినుత బెయిల్ పై బయటకు రాగా, ఆమె భర్త చంద్రబాబు, వారి సహాయకులు గోపి, షేక్ దాసన్, శివకుమార్ లు ఇంకా రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. అయితే ఈ హత్య కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని బొజ్జల సుధీర్ రెడ్డి చెబుతున్నారు. చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి చేరుకుని పలువురిని ఈ కేసులో విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారించే అవకాశాలున్నాయంటున్నారు.