YSRCP : ఫ్యాన్ స్పీడ్ ను బాలయ్య పెంచేసినట్లుందిగా...? స్విచ్ ఆన్ చేశారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏదో ఒక రూపంలో విపక్షానికి కాల కలసి వస్తుందని భావించి ఉంటారు కానీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏదో ఒక రూపంలో విపక్షానికి కాల కలసి వస్తుందని భావించి ఉంటారు కానీ.. అందులో టీడీపీ నేత, చంద్రబాబు నాయుడు బామ్మర్ది బాలకృష్ణ రూపంలో తమ పార్టీకి హైప్ వస్తుందని వైసీపీ నేతలు ఊహించి ఉండరు. వైసీపీకి ఎటూ దారి తోచని స్థితిలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ పార్టీకి ఒక మార్గం చూపినట్లయింది. ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలతలు ఎత వరకూ పెడతాయో తెలియదు కానీ, వైసీపీకి మాత్రం కొండంత బలం చేకూర్చాయని చెప్పాలి. జగన్ సైకోగాడంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొంత బాధ కలిగించవచ్చు కానీ, అదే సమయంలో బాలయ్య చిరంజీవి పై చేసిన కామెంట్లు తమకు కలసి వచ్చేటట్లుగా ఉన్నాయని తెగ ఖుషీ ఫీలవుతున్నారు.
గత ఎన్నికల్లో పవన్ చేసిన ఆరోపణలు...
గతంలో జగన్ పై చేసిన ఆరోపణలన్నీ ఒక్కసారిగా బాలయ్య తెలిసీ తెలియకుండా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రయోజనం కల్పించాయి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ వద్దకు వెళ్లినప్పుడు తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని పదే పదే ఆరోపించారు.జగన్ యాటిట్యూడ్ అదేనని, సాక్షాత్తూ చిరంజీవినే అవమానిస్తే ఇక సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు. కానీ అప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించని చిరంజీవి నేడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో కొంత ఘాటుగానే స్పందించారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారన్నారు. తనను అవమానించలేదని చిరంజీవి చెప్పడంతో వైసీపీకి పవన్ కల్యాణ్ గతంలో చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది.
కాపు సామాజికవర్గంలో...
మరొకవైపు బాలయ్య చేసిన వ్యాఖ్యలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలపై కూడా అక్కడ కాపు సామాజికవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ అన్ని మాటలు చిరంజీవిని అన్నప్పటికీ జనసేన మంత్రులు అసెంబ్లీలో ఉండి ఎందుకు ఖండించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమలోని బలిజ సామాజికవర్గం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పవన్ కల్యాణ్, నాగబాబు లు కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో పాటు టీడీపీ ముఖ్య నేతలు కూడా కనీసం ఆ వ్యాఖ్యాలపై చిరంజీవికి అనుకూలంగా కామెంట్స్ చేయకపోవడంపై కాపు సామాజికవర్గం నేతలతో పాటు చిరంజీవి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇది కనిపిస్తుంది. అందుకే వైసీపీ తమ అధినేతను సైకో అని అన్నప్పటికీ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో వాతావరణం తమకు అనుకూలంగా మారిందన్న లెక్కలు వేసుకుంటున్నారు.