Achennaidu : సూపర్ సిక్స్ గురించి చెప్పాలని ఇంటింటికి పంపితే.. రివర్స్ లో చెబుతున్నారేంటి? ఈరోజు క్లాస్ ఉంటుందా?
అచ్చెన్నాయుడు ప్రస్తుత చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో సీనియర్ మంత్రి
అచ్చెన్నాయుడు ప్రస్తుత చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో సీనియర్ మంత్రి. కింజారపు కుటుంబం కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని రాజకీయాలలో ఉంది. పసుపు జెండా తప్ప మరొక జెండా కింజారపు కుటుంబానికి తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా కింజారపు కుటుంబానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. వారి కుటుంబానికి ప్రత్యేక మినహాయింపులుంటాయి. అందరికీ ఒకే ఫ్యామిలీలో ఒకే టిక్కెట్ అని దానిని అమలు చేస్తే ఆ నిబంధన మాత్రం కింజారపు కుటుంబానికి వర్తించదు. మొన్నటి ఎన్నికల్లోనూ శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు, టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, అలాగే రాజమండ్రి పట్టణ ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసులకు టిక్కెట్ ఇచ్చారు.
ఒకే కుటుంబానికి...
మూడు టిక్కెట్లు ఒకే కుటుంబానికి ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పదవిని రామ్మోహన్ నాయుడుకు ఇచ్చారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పోస్టును అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టయ్యారన్న సానుభూతి కూడా చంద్రబాబులో ఉంది. దీంతో పార్టీ పట్ల కుటుంబం విధేయతతో పాటు సీనియారిటీని, సిన్సియారిటీని కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు కూడా పార్టీ పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తారన్న పేరుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వాయిస్ ఎప్పుడూ రైజింగ్ లోనే ఉంటుంది. భయపడకుండా వ్యవహరించడమే అచ్చెన్నకు ప్లస్ గా మారింది.
పనితీరుపైనే కాకుండా...
కానీ ఇప్పుడు మాత్రం అచ్చెన్నాయుడు పనితీరుపై మొన్నటి వరకూ అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన వ్యాఖ్యలు కూడా పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. తాజాగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులోనూ ప్రభుత్వ విధానాన్ని బహిరంగంగా ప్రకటించడమేంటని? పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుందని సమాచారం. ఆడబిడ్డ పథకం కింద మహిళలకు నెలకు పదిహేను వందలరూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని హమీచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇంతవరకూ ఈ పథకం అమలు చేయలేదు.
అచ్చెన్న వ్యాఖ్యలు వైరల్...
దీనిపై విజయనగరం జిల్లాలో జరిగిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆడబిడ్డ పథకం కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు దీనిపై చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తామని, అయితే ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందలు నెలకు అమలు చేయలేమని బహిరంగంగా చెప్పేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల గురించి ఇంటింటికీ తిరిగి చెప్పమంటే.. రివర్స్ లో అమలు చేయని పథకాలను గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఫైర్ అవుతున్నట్లు సమాచారం. ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో అచ్చెన్నాయుడుకు చంద్రబాబు క్లాస్ పీకే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.