తుఫానుగా బలహీనపడిన అసని.. నరసాపురం వద్ద తీరం దాటే అవకాశం ?

ప్రస్తుతం తుఫాను మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 150, విశాఖపట్నంకు 310, గోపాలపూర్ కు 530, పూరీకి 640 కిలోమీటర్ల..

Update: 2022-05-11 05:21 GMT

అమరావతి : బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా ఉన్న అసని.. తుఫానుగా బలహీనపడినట్లు ఏపీ విపత్తునిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ప్రస్తుతం తుఫాను మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 150, విశాఖపట్నంకు 310, గోపాలపూర్ కు 530, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొన్నారు. కొద్దిగంటల్లో వాయువ్య దిశగా పయనించి ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని, నరసాపురం వద్ద తుఫాను భూభాగం పైకి రావొచ్చని తెలిపారు.

బుధవారం సాయంత్రానికి అసని.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. తీరంవెంబడి గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




Tags:    

Similar News