Andhra Pradesh : కోడికూర.. చేపల పులుసు.. రారమ్మని పిలుస్తున్న పార్టీ కార్యాలయాలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు

Update: 2024-02-07 03:45 GMT

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు ప్రజలకు చేరువయ్యేందుకు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో విందుభోజనాలు ఒకటి. ప్రధానంగా కోనసీమ జిల్లాల్లో ఇలాంటి విందుభోజనాలు ఎక్కువయ్యాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పార్టీల నేతలు అనేక రకాల వంటలతో భోజనాలను సిద్ధం చేసి జనాలను ఆహ్వానించి కడుపు నిండా తినివెళ్లమంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇప్పటికే కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లో ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయాల్లో మాంసాహార భోజనాలను వడ్డిస్తున్నారు.

పార్టీల కార్యాలయాల్లో...
ఎవరు వచ్చి తిని వెళ్లినా వారికి తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి నుంచే భోజనాలు ప్రారంభించడంతో పోలింగ్ వరకూ నిర్వహించాలంటే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడంత అవుతుంది. చేపల పులుసు, కోడి కూర, మటన్ లతో పసందైన భోజనాలను వడ్డించి మరీ జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలను అన్ని పార్టీల నేతలు చేస్తున్నారు. అయితే ఎక్కడ మెనూ బాగుంటుందో అక్కడకు వెళ్లి జనం భోజనం చేస్తుండటంతో వంటల తయారీలో కూడా పోటీ పెరిగింది. పసందైన, రుచికరమైన వంటకాలను సిద్ధం చేసి మరీ వడ్డిస్తుండటం ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే... అభ్యర్థులు ఖరారు అవ్వకముందే భోజనాలు పెడుతుండటం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News