Appsc : అనూరాధ ..ఎవరి మాట వినరు.. నిబంధనల మేరకే చేస్తారు
ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనూరాధ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనూరాధ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాలను సయితం పట్టించుకోకుండా నిబంధనల మేరకు నడచుకోవడంతో ఆమె తీరుపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రశంసలు తెలుపుతున్నారు. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. ప్రభుత్వంతో సంబంధం లేదు. అయితే అది బయటకు మాత్రమే. అయితే పాలకవర్గాన్ని నియమించేది ప్రభుత్వమే కాబట్టి సర్కార్ చెప్పినట్లు నడుచుకునే ఛైర్మన్ లను గతంలో చాలా మందిని చూశాం. కానీ అనూరాధ మాత్రం తన విధినిర్వహణలో నిబంధనలను ఏ మాత్రం అతిక్రమించకుండా ఆమె వ్యవహరిస్తున్న తీరు అందరిని మెచ్చుకునేలా చేస్తుంది.
స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా...
ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలుంటాయి. కానీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏపీపీఎస్సీకి అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ పరీక్ష కు సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హాల్ టిక్కెట్లు కూడా పంపింది. పరీక్ష కేంద్రాలను కూడా ఖరారు చేసింది. అయితే రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాయాలని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొందరు మనుషులను ఏపీపీఎస్సీకి పంపి పరీక్షను వాయిదా వేయాలని కోరారని చెబుతున్నారు.
వాయిదావేయలేమని...
కానీ ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనూరాధ మాత్రం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ముందుగా ప్రకటించిన విధంగానే పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున పరీక్షలను వాయిదా వేస్తే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని భావించి తాము వాయిదావేయలేమని ప్రభుత్వానికి లేఖ రాయడం నిజంగా సంచలనమే. అనూరాధ ఐపీఎస్ అధికారి. మాజీ పోలీసు అధికారి సురేంద్ర బాబు సతీమణి. మంచి అధికారిగా పేరుంది. అలాంటి అనూరాధ పరీక్షను వాయిదా వేయకుండా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
న్యాయస్థానంలో కేసులు...
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి. అనేక మంది అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఆందోళనకు కూడా దిగారు. అందుకే ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీని కోరింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున, రోస్టర్ విధానాన్ని సవరించాల్సి ఉన్నందున వాయిదా వేయాలని కోరినా అనూరాధ మాత్రం నిబంధనల మేరకే నడుచుకున్నారన్న ప్రశంసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.