చంద్రబాబు గురించి ఐటీడీపీకి తెలియదా?: మంత్రి జోగి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

Update: 2023-06-10 07:42 GMT

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని తన పాలన కాలంలో చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. శనివారం మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు.. ఆరిపోయిన టీడీపీకి అధ్యక్షుడని, ఆయన జీవితం గురించి ఐటీడీపీకి తెలియనట్టుందన్నారు. ఎన్‌టీఆర్‌ను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా తెలీదా? అంటూ ఐటీడీపీని మంత్రి జోగి ప్రశ్నించారు. చంద్రబాబుకు సవాల్‌ స్వీకరించే దమ్ము కూడా లేదన్నారు. ఇక లోకేష్‌ పాక్కుంటూ యాత్ర చేసిన గెలవలేడని మంత్రి అన్నారు.

2014లో ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో ఏడాదికి 12 సిలిండర్లు, సబ్సిడీ ఇస్తానని చెప్పారని.. మరి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 14,500 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మహిళలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. హైస్కూల్‌ పిల్లలకు సైకిళ్లు ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. నిరుద్యోగ భృతి పేరు చెప్పి యువతను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసునన్నారు. మొదటి సంతకం చేసినా బెల్టు షాపులు ఒక్కడి కూడా ఎత్తివేయలేదని, మంచి నీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబూ? అని ప్రశ్నించారు.

పేదలను ధనవంతులను చేస్తానని చంద్రబాబు నెరవేర్చని హామీలను ఇస్తున్నాడని అన్నారు. పేదలకు ఇళ్లులు కట్టిస్తామంటే అడ్డుకుని కోర్టుల్లో పిటిషన్లు వ్యక్తి.. ఇప్పుడు పేదలను ఎలా ధనవంతులను చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా పోరాటం చేసే వ్యక్తి జగన్‌ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగన్‌ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టులు పనులు వేగంగా జరుగుతున్నాయని, అదీ ప్రజల మీద సీఎం జగన్‌ ఉన్న ప్రేమ అని మంత్రి రమేష్ అన్నారు. పోలవరాన్ని.. ఏనీ టైం మనీలా వాడుకున్నది చంద్రబాబు మంత్రి జోగి ఆరోపించారు. 

Tags:    

Similar News