కుమారుడి వర్థంతి రోజు అరెస్ట్.. ఏపీ ప్రభుత్వంపై టిడిపి ఫైర్

మంగళవారం హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో కొడుకు వర్థంతి కార్యక్రమంలో ఉండగా.. ఏపీ సీఐడీ పోలీసులు..

Update: 2022-05-10 10:45 GMT

హైదరాబాద్ : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పొంగూరు నారాయణను మంగళవారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బయటికొచ్చిన విషయం అందరినీ విస్తుపోయేలా చేసింది. నారాయణ ఆయన కుమారుడు నిషిత్ వర్థంతి కార్యక్రమంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారంటూ టిడిపి ఆరోపించింది. ఈ మేరకు టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది.

"కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉండగా అరెస్ట్ చేయడం ఏమిటి? కొంచం అయినా మానవత్వం ఉందా జగన్ రెడ్డి?? మే 10 తన ఒక్కగానొక్క కొడుకు నిషిత్ నారాయణ చనిపోయిన రోజు.. ఆ వర్ధంతి ఏర్పాట్లలో ఉండగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్. ఆయన ఏమీ పారిపోయే వ్యక్తి కాదు కదా ఎందుకీ కక్ష? ఖర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవ్వరిని వదలదు జగన్ రెడ్డి!!" అంటూ టిడిపి సీఎం జగన్ పై ధ్వజమెత్తింది.
నారాయణ కుమారుడు 2017, మే 10వ తేదీన హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి విధితమే. నేడు నిషిత్ 5వ వర్థంతి. నితీశ్ వర్థంతి కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సోమవారమే పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. మంగళవారం హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో కొడుకు వర్థంతి కార్యక్రమంలో ఉండగా.. ఏపీ సీఐడీ పోలీసులు నారాయణను అరెస్ట్ చేయడంతో.. కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. నారాయణను అరెస్ట్ చేసి పోలీసులు వెంట తీసుకెళ్లగా.. ఆయన భార్య రమాదేవి కూడా వాళ్లతో బయల్దేరారు. నితీశ్ వర్థంతి కార్యక్రమాన్ని పూర్తిచేయనివ్వకుండా.. అరెస్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా.. రోడ్డుప్రమాదంలో కొడుకు మృతి చెందిన నాటి నుంచి నారాయణ కుటుంబం తీవ్రవేదనలో ఉండిపోయింది. ఆ తర్వాత ఆయన పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఏపీ రాజకీయాల్లోనూ కనిపించలేదు.


Tags:    

Similar News