ఉచిత వైద్యం అందరికీ : జగన్

రాష్ట్రంలో మొత్తం 28 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు

Update: 2023-09-15 07:51 GMT

రాష్ట్రంలో మొత్తం 28 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో ఐదు ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 11 మెడికల్ కళశాలలు ఉంటే ఈ నాలుగేళ్లలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. దీనివల్ల 2,250 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లోనూ వైద్య కళాశాలలు రావడం వల్ల మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. వీటితో పాటు మరో 18 నర్సింగ్ కళాశాలలు కూడా అందుబాటులోకి వస్తాయని జగన్ తెలిపారు. మెడికల్ సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని, తద్వారా ఏపీ విద్యార్థులు ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసించగలుగుతారన్నారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో...
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఒక్కరోజే ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించుకున్నామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనివల్ల గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రివెంటివ్ కేర్ లో భాగంగా విలేజ్ క్లినిక్‌లను కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే అది ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని వివరించారు. అంబులెన్స్‌లను కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. యాభై వేలమందికి పైగానే వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బందిని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించడం జరిగిందని జగన్ తెలిపారు.
2.35 లక్షల కోట్లు...
బటన్ నొక్కితే నేరుగా 2,35,000 కోట్ల రూపాయల నిధులను పేద ప్రజల ఖాతాల్లో వేశామని తెలిపారు. లంచాలకు తావులేకుండా వివక్షకు చోటు లేకుండా అర్హులైన వారందరికీ సాయం అందించామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలను ఇస్తున్నామని, 30 లక్షల మందికి నివేశన స్థలాలను పంపిణీ చేస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఉచితంగా మందులు, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని ఆయన కోరారు. పథకాలు పొందని వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని జగన్ తెలిపారు.


Tags:    

Similar News