ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

జలవనరుల శాఖలోనూ పలు నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల

Update: 2023-07-12 10:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలోని మొదటి బ్లాకులో జరిగిన ఈ భేటీలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో 55 అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆర్5 జోన్ లో 47వేల ఇళ్ల నిర్మాణానికి, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. 15 వేల డీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల పై కెబినెట్ లో మంత్రులు చర్చించారు. అలాగే మంగళవారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది.

జలవనరుల శాఖలోనూ పలు నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపుకు, అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. టిడ్కో కాలనీల్లో 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి రూ.750 కోట్లు రుణంగా తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.454 కోట్ల పరిహారం ప్యాకేజీ మంజూరుకు, శ్రీకాకుళం జిల్లా భావనపాడు - మూలపేట పోర్టు నిర్మాణానికై రూ.3,880 కోట్ల రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సమావేశమైన జగన్.. జగనన్న సురక్ష పథకం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.



Tags:    

Similar News