Andhra Pradesh : కూటమి విడిపోతుందనుకోవడం కలే.. అది భ్రమకాక మరేంటి?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి విడిపోతుందన్న భ్రమలు ఎవరికైనా ఉంటే అవి నిజంగా భ్రమలేనని చెప్పాలి

Update: 2026-01-12 09:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి విడిపోతుందన్న భ్రమలు ఎవరికైనా ఉంటే అవి నిజంగా భ్రమలేనని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి కలసి పోటీ చేస్తుంది. ఇది ఫిక్స్ రాసిపెట్టుకోండని ... పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాటలు నిజమేనని పిస్తుంది. ఎందుకంటే .. దక్షిణాదిలో బీజేపీకి పట్టు చిక్కని ప్రాంతమేదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాత్రమే. తమిళనాడులో డీఎంకేను గద్దె దింపడానికి అన్ని రకాలుగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో ఎటూ బీజేపీ బలంగా ఉంది. కేరళలోనూ బలపడుతుంది. తెలంగాణలో మంచి స్థానాలను ఇప్పటికే సాధించింది. ఇక ఒడిశా, మహరాష్ట్రలలో అధికారంలో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ బలోపేతం కాలేదు.

బీజేపీకి అంతకు మించి...
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలతో కలిసి ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. ఆ రెండింటితో కలిస్తేనే కొద్దో గొప్పో పార్లమెంటు స్థానాలు ఏపీలో బీజేపీకిదక్కే అవకాశాలున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా రాదన్న విషయం బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలియంది కాదు. అందుకే గత రెండేళ్ల నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇక్కడ పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కూడా కనిపించక పోవడమూ అదే కారణం. జగన్ తో పొత్తు కుదరని పని. పరోక్షంగా మద్దతు ఇవ్వవచ్చేమో కానీ, ప్రత్యక్షంగా పొత్తుకు జగన్ అంగీకరించడు. అందుకే ఖచ్చితంగా టీడీపీతోనే తమ ప్రయాణమని బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఫిక్సయింది. అందుకే చంద్రబాబుకు, లోకేశ్ కు మోదీ అంత ప్రయారిటీ ఇస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది.
పవన్ మాటల్లోనూ...
మరొకవైపు పవన్ కల్యాణ్ కూడా జగన్ ను తిరిగి అధికారంలోకి రానివ్వనని పదే పదే చెబుతున్నారు. కూటమి విడిపోదని అంటున్నారు. తనకు, చంద్రబాబుకు మధ్య మంచి అవగాహన ఉందని తరచూ చెబుతున్నారు. తాము ఏ విషయంలోనైనా కలసి కూర్చుని మాట్లాడుకుంటామని, పదిహేనేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు కూడా విభేదాలు పక్కన పెట్టి కూటమిగా పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నివ్వడం అందులో భాగమేనంటున్నారు. వైసీపీ నేతలు కూటమి విడిపోతుందని బాగా ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి వచ్చే ఎన్నికలకు మాత్రం ఫలించవని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, కూటమిని మాత్రం ఎవరూ విడదీయలేరన్న వాస్తవ పరిస్థితులు ఏపీ రాజకీయ ముఖచిత్రం చూసిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది.


Tags:    

Similar News