బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి భారీ వర్షసూచన

నేటి నుంచి రెండు, మూడ్రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తూ.గో జిల్లా, విజయనగరం, విశాఖపట్నం..

Update: 2022-09-18 12:05 GMT

నాలుగురోజుల క్రితం వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ల్లో భారీ వర్షాలు కురిసాయి. వారంరోజులపాటు కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు, వాగులు-వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. తాజాగా మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి రెండు, మూడ్రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తూ.గో జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తారని హెచ్చరించింది. అలాగే తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈనెల 20 నుంచి 22 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపు సాయంత్రానికల్లా తీరానికి చేరుకోవాలని సూచించింది. కాగా.. అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.




Tags:    

Similar News