Andhra Pradesh : గుడ్ న్యూస్... ఇరవై ఐదు లక్షల వరకూ ఉచితంగా వైద్యం.. కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. హెల్త్ పాలసీకి కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. హెల్త్ పాలసీకి కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కొత్త హెల్త్ పాలసీని తెచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకూ ఉచితంగా వైద్యం లభించనుంది. అయితే ఎటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించేలా కొత్త హెల్త్ పాలసీని ప్రభుత్వం అమలులోకి తేనుంది.
అన్ని కుటుంబాలకు...
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 1.63 కోట్ల కుటుంబాలకు ఈ ఆరోగ్య బీమా పథకం వర్తించనుంది. ఏ అనారోగ్యం సంభవించినా ఈ హెల్త్ పాలసీ ద్వారా జేబులో సొమ్ము ఖర్చు చేయకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందే వీలుగా ఈ విధానాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ లోని 2493 నెట్ వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానం ద్వారా ఉచిత వైద్య సేవలను అందించనుంది. ఈ విధానంలో మొత్తం 3,257 రోగాలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తారు. అయితే ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికివెళ్లి ఇన్ పేషెంట్ గా చేరిన ఆరు గంటల్లోనే అనుమతులు మంజూరు అయ్యేలా కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. గతంలో ఉన్న ఆరోగ్య శ్రీ స్థానంలో ఈ విధాన్ని ప్రవేశపెట్టింది.
అన్ని రకాలైన వైద్యానికి...
దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా రూపొందించింది. అదే సమయంలో రెండున్నర లక్షల లోపు వైద్య ఖర్చులను బీమా కంపెనీలు భరించనున్నాయి. ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ద్వారా మరో రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది వరకూ వైద్య సాయం అందుతుంది. ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1.43 కోట్ల నిరుపేద కుటుంబాలతో పాటుగా, మరో ఇరవై లక్షల కుటుంబాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం ఎక్కువ భారం పడకుండా ఈ కొత్త ఆరోగ్య పాలసీని అమలులోకి తెచ్చేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడమే కాకుండా నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై ఏపీలోని ప్రజలందరూ ఈ పథకం కింద ఆరోగ్య బీమాను పొందనున్నారు.