Annadatha Sukhibhava Secheme : రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో "అన్నదాత సుఖీభవ" నగదు జమ
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. ఈ నెలలోనే 'అన్నదాతా సుఖీభవ' డబ్బు జమ చేయాలని నిర్ణయించింది.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. ఈ నెలలోనే 'అన్నదాతా సుఖీభవ' డబ్బు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన లబ్దిదారుల ఎంపికను కూడా పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించే అవకాశముంది. అదే సమయంలో కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు.
పీఎం కిసాన్ నిధులతో పాటే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ డబ్బు రెండు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం కసరత్తులు కూడా ప్రారంభించింది. అక్టోబర్ లో రెండో విడత, వచ్చే జనవరిలో మూడో విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు ను జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అర్హులని నియమించి...
ఇందుకు అవసరమైన నిధులను కూడా సమీకరించి పెట్టుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు లబ్దిదారుల జాబితాతో పాటు అవసరమైన నిధులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా పదమూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అన్నదాత పథకం కింద తొలి విడత ఏడు వేల రూపాయలు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ డబ్బు జమ తేదీ మారితే అనుగుణంగా ఈ డేట్ కూడా మారే అవకాశముందని చెబుతున్నారు. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. మొత్తం మీద అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 20వ తేదీన జమ చేయనున్నారు.